Download

బ్రాహ్మణ పురోహితులకు పందేశము: (Download)

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.

Monday, March 31, 2008

కాలకంధరా ! ఇదె కార్తీక దీపం

కాలకంధరా! ఇదె కార్తీక దీపం
నాగాభరణా ! ఇది నా ప్రాణదీపం
భక్తి తైలమై ఙ్ఞానమె వత్తిగ
వెలిగింది దేవ ! నీ కోసమేను (పల్లవి)

నా బాష్పధార - గంగా జలమై గద్గద గళమే - డమరు నాదమై
తనువున కంపమె - శివతాండవమై (నను) నీ పాదధూళి - కణమై పోనీ !

అహంకారినై - పాపాత్ముడినై పతితుడనైతిని - పరమేశా
నీవె కాదన్న - నేనేమి చేతు నీ పదముల పడి ఏడ్చెదను

నాధ! నీవుండ - అనాధుడనైతి కరుణార్ణవమా - కదలి రావేల ?
(నీ) ఙ్ఞానాగ్ని నేత్ర - శిఖలో కాలెద (నను) నీ దయా గంగలో-కలిసిపోనీ !

ఏనాటికైన - నీవాడ నేను నిను వీడి బ్రతుక - లేనీ కలిని
నా ప్రాణనాధ - నీ చరణమందు నా ప్రాణదీపం - ఆరిపోనీ

Download this bhajan sung by Shri Dattaswami here
---------------------
కాశీవాసా ! కాలభైరవా !
కరుణించవేల? కాలకంధరా (పల్లవి)

విషయవాసనలు విషసర్పములై - కాటువేయగా నేనేమి చేతు
హాలాహలమునె మధురామృతముగ - త్రాగిన దేవా ! కాపాడరావా?

కామాది గుణములు కలి రాక్షసులు - క్రమ్ముకొనిరి నను నేనేమి చేతు
కాముని త్రిపురుల చూచి బూడిదగ - చేసిన దేవా ! చేదుకొనరావా

చింతల పలుగుల పోటుల చిత్తము - చూర్ణమయ్యెనుగ నేనేమి చేతు
అట్టహాసమున జగముల చూర్ణము - కావించుదేవా ! కరుణించలేవా

ఏకాగ్రతతో ఏక దృష్టితో - నినుఁ జూడలేను నేనేమి సేతు
ఏకాద్వితీయ హేదత్త దేవ ! - మదన దాహక! మాంపాహి పాహి

Download this bhajan sung by Shri Dattaswami here

శివ తాండవ కీర్తన

కైలాస మందు - కలవరమాయెను చూడవె పద్మా నా కొండనెక్కి
శివ దత్తుని సుందర నృత్యమదే మధ్య మధ్య నదె రుద్ర తాండవము

విష్ణుదత్తుడగు నాతో నృత్యము - చూడ వచ్చెనదె బ్రహ్మ దత్తుడును
ప్రళయ కాలమున ఇరువురమగుదుము - శివదత్తునిలో ఐక్యము చివరకు

ఒకడే దత్తుడు పరమబ్రహ్మము - త్రిమూర్తులాయన త్రిగుణ వేషములు
ఊహవిశ్వ రచనా వ్యూహమీవు - ఊహసుందరివి అనఘవు పద్మా !

మధుమతి ! లలితవు ! దుర్గవు ! కాళివి - రాజరాజేశ్వరివి ప్రధమోహవు
వాణియు లక్ష్మియు గౌరియు నీదగు - ముచ్చట గొలిపెడి ముద్దువేషములు

అనసూయాత్రులు ఆనందముతో - ఆలోకింపగ ఆసినులైరి
ఋక్ష పర్వతము నందున వారికి - దత్తపుత్రునిగ దత్తుడు నిలచెను

తకధిమి తకధిమి నంది మృదంగము - ప్రమధ గణంబుల వాద్యనాదములు
నర్తనలోలుడు నటరాజు శివిడు - తాండవమాడెను దత్తాత్రేయుడు

పదములకదనము వడివడిగాబడ - బహువిధ భంగిమ లంగములొప్పగ
గజ్జెల సవ్వడి ననుసరించెగా - కాలకంఠుని విచిత్ర నాట్యమున

గంతులువేయగ కాలికి చుట్టిన - కాల సర్పమదె కస్సుబుస్సుమన
గజ్జెల సవ్వడి ననుసరించెగా - కాలకంఠుని విచిత్ర నాట్యమున

శ్రీశైలరాయుని శివతాండవమున - చిందుల అందము లేమందునె చెలి
అప్సరసలె తమ నాట్యమేలయని - సిగ్గుతో తలల వంచిరి చూచుచు

కాశీపురపతి కాలిగంతులవె - కంపించె శేషుడల్లాడెను ధర
అదిరి దిక్కరులు కుంభస్థలముల - తొండములెత్తుచు ఘీంకరించినవి

కాలభైరవుని కరాళ వక్త్రము - ఫాలాక్షి వహ్ని దీధితి మెరుపుల
అట్టహాసముల చేయగ ప్రాణులు - గడగడ వణుకుచు పరుగులెత్తిరే

శివశివ భవ భవ శంభో ! హరహర ! - అనుచు మహర్షుల ఆర్తనాదములు
మిన్నుముట్టినవి శరణాగతితో - శాంతింప జేయ ఆ తాండవమును

కాలకంఠుడదె రుద్రతాండవము - చేసెను త్రిప్పుచు ఢమఢమ ఢక్కను
కైలాసాచల శిలా స్ఫటికములు - విస్ఫోటనముల బీటలు వారెను

విశ్వేశ్వరతను విభూతి చిందెను - వెచ్చ వెచ్చనిది పరమపావనము
నుదుట ధరింపగ ఇంద్రాదులంత - నక్కి నక్కి అట సంగ్రహించిరే

నందీశ్వరుడదె రంకెలు వేయును - గర్జింతురగో ! ప్రమధగణంబులు
చిందులు తొక్కెను చిరుత గణేశుడు - మయూర వాహనుడాడె మైమరిచి

ద్వాదశ లింగము లుజ్జ్వలమయ్యెను - గంగ పరవళ్ళు తొక్కుచు పారెను
నాగాభరణములాడె నాట్యమును - కంపించె చంద్ర కళయును సొగసుగ

గంగాధారల చినుకుల జల్లుల - చంద్ర రేఖ హిమ బిందువులెగురగ
రెండు కన్నులను చల్లని చూపుల - ఆనంద మొకసారి వెలయు

ఫాలాగ్ని చక్షు రుగ్రాగ్ని శిఖలు - ఎర్రని కాంతులు చిమ్ముచుండగను
అహి భూషల పుత్కారములందున - రుద్ర తాండవము చెలగునొకసారి

ఎర్రని జటలెగురగ పంచాస్యుడు - అట్టహాసముల తాండవమందున
ఎర్రజూలు ఎగురగ పంచాస్యుడు - దూకి గర్జించు రీతిగఁ దోచెను

శేషుని సహస్ర ఫణములదొర్లుచు - భూగోళమాడె బంతిని పోలుచు
దానిని నిలుప వేయి పడగలను - రొప్పుచు తిరిగెను పాదఘాతముల

భంభం నాదము లంబరమంటగ - శంఖ ధ్వనులను ప్రమధులు చేసిరి
అప్సరసలాడిరీక్షించి నాట్య - నవ్య భంగిమల నేర్చుకొనగ దివి

చుక్కల రాలెను ముక్కంటి చూపు - వర్షించు విస్ఫులింగములంటగ
సూర్యదేవుడును చిటపట లాడెను- ఏడు గుర్రములు సకిలించి నిలచె

శాంత నృత్యముల వీణలు మీటుచు - నారదతుంబురు లెగురుచు పాడిరి
రుద్రతాండవము లందున భయపడి - కల్ప వృక్షముల చాటున దాగిరి

అదురుచు బెదురుచు పరుగులెత్తుచును - ఆక్రందించిరి అసురేశ్వరులే
హరహర శంభో పాహి పాహియని - ప్రణతులఁ జేయుచు సాష్టాంగముగా

నటనములందున పదముల మృదుమృదు-నూపుర ఝలఝల రవములు చిందగ
సుందరేశ్వరుని శిరసున గంగా - లహరీ ధ్వనులవె తాళములాయెను

ఎగురుచు దూకుచు వంగుచు లేచుచు - మెలికలు దిరుగుచు వక్రభంగిమల
చంద్రశేఖరుడు తాండవమాడెను - తళతళ మెరిసెడి తెల్ల నాగువలె

హిమాలయాచల మందున దూకెడి - తెల్ల మంచుపులి విద్యుద్రయముగ
వామదేవుడదె తాండవ ధాటిని - అంగ భంగిమల చకచక మార్చెను

ఒకసారి మంద మధుర స్మితుడగు - ఒకసారి అట్టహాస గర్జనుదు
మాధుర్యమొకచో రౌద్రంబొకచో - అమృత హాలహల పారవారముగ

గౌరిముఖ పూర్ణేందు బింబమును - చూచిన వెంటనె హరుడుప్పొంగెను
అంగములాడగ నృత్యము చేసెను - పున్నమి రాతిరి పొంగిన జలధిగ
గౌరమ్మ కూడ నృత్యము చేసెను - కొంతకాలమట శివునితో గూడి
తాండవధాటికి అలసి కూర్చుండె - స్విన్నావయవము లదురుచు నుండగ

నీలలోహితుని నిరుపమ తాండవ - మానందార్ణవ మవధులు లేనిది
నా విశ్వరూప దర్శన సమమది - చూడువారలకు జన్మ ధన్యమగు

రుద్రాక్ష హార వలయము లురమున - గలగల రవములు చేయుచునుండగ
వాసుకి గళమున నర్తించె పడగ - మణిదీధితులవె నృత్యము చేయును

ఒకచో ఢక్కను కొట్టును తిప్పుచు - ఒకచో శూలము తిప్పుచు తిరుగును
ఒకచో చూపును రిక్త హస్తముల - నాట్య ముద్రలను నటరాజు శివుడు

నారాయణ ప్రియుడతడె పద్మా ! నంది వాహనము గంతులు వేయగ
మెడలో పదముల గల గజ్జెలతో - గల గలశబ్దము కర్ణ ప్రియమదె

నటన మనోహరుడెంత సుందరుడు - దిష్టి తగులునని పుర్రెల మాలల
సర్ప భూషలను ధరించునీశుడు - కామున కీర్ష్యను పరిహరింపగా

కాముని దగ్ధము చేసెనందురిల - వట్టి మాటయది సుందరేశ్వరుని
అందము చూసిన స్మరుడె చేసుకొనె -ఆత్మ హత్యనే తగుల బెట్టుకొని

అతడే కనకా భరణములఁ దాల్చు - పురుష మోహనుడ నేనె మోహినిగ
మారిమోహమును పొందితి కలిసితి - మణికంఠునికే జన్మ నిచ్చితిని

నన్నుజూచి మునులెత్తిరి జన్మల - గోపికలుగ పురుషులకె మోహము
నా అందము కలిగించె నాకె అది - శివునిఁ జూడగా కలిగెను పద్మా

ఋషుల హృదయముల వికార హేతువు - నేనైతిని గద నా పాపమునకు
శిక్షగ నాకే ఆ వికారమే - కలిగెను కర్మ ఫలంబులు తప్పవు

ఆది దేవునిది అద్భుత తాండవ - మవలోకించిన భరత మహర్షియు
నాట్య శాస్త్రమును వ్రాసె శంకరుడు - నాట్యాధి దేవుడనగ దత్తుడే

హావ భావముల నభినయించుచును - ఆడుచున్నాడు ఆది దేవుడదె
చూడుము పద్మా! ఎంతో పుణ్యము - చేసిన వారికె లభ్య మీ ఫలము

నీలకంఠుడదె నిర్మల హృదయుడు - నిష్ఠానియతుదు నిశ్చల చిత్తుడు
కరుణా సాగరు డత్యుదారమతి - ఆత్మ సౌందర్య మపారమతడిది

రావణుడడిగిన పార్వతి నిచ్చెను - ఉపమన్యువడుగ క్షీరాబ్ధినిచ్చె
భస్మాసురునకు తననే భస్మము - చేయు వరమిచ్చె ప్రేమ సముద్రుడు

శివుని కళ్యాణ గుణ రూపములను - ఆదిశేషుడును వర్ణించలేడు
అతడి పొందుకై ఎంత తపించెను - పార్వతి దానిని బట్టియె తెలియును

నీ మొగుడు నేను నిజమే పద్మా - నా మొగుడు శివుడు మోహిని నైతిని
శివుడు తండ్రిగా నేను తల్లిగా - నా సుతుడు బ్రహ్మ గురువుగ నగుదుము

ఒక్కడె దత్తుడు వాని భావములె - గుణత్రయముగా త్రిమూర్తులైతిరి
భావమె రూపము దాల్చె నూహయది - గుణమన భావమె గుణమే రూపము

ఒక్కడె మనుజుడు మూడు భావముల - నున్న రీతిగా ముగ్గుర ముందుము
సృష్టి స్ధితి లయ కర్మ భావముల - త్రిమూర్తులనగా త్రిగుణ భావములె

ఊహించునపుడు బ్రహ్మ దేవుడన - ఊహను నిల్పగ విష్ణుదేవుడన
ఊహనాపగ రుద్ర దేవుడన - ఒక్కడె దత్తుడు మూడు నామముల

ఒకచో నొక్కొక మూర్తి గొప్పయగు - మిగిలిన యిరువురు తగ్గియుందురిట
ఈ భేదమంత క్రీడా వినోదము - పరమార్ధములో ముగ్గురు ఒక్కడె

ఆడేదినేను చూచేది నేను - నా ఆట నేనే ఆనందింతును
ఆనందిచుట కొరకై భేదము - మాయా బలమున కల్పించెదనిట

మూడు భావముల త్రిమూర్తులైతిని - నానా భావము లయ్యెను జగతిగ
దత్తైక్యముతో త్రిమూర్తులుందురు - దత్త భిన్నముగ జగములు వెలుగును

దత్తాధారము జగత్తు భిన్నము - నేతి నేతియని శ్రుతియిదె చెప్పును
పీటపైన ఘటమున్నది కానీ - ఘటమందు పీట లేదని తెలియుము

త్రిమూర్తులందున వ్యాపించియుండు - దత్తుడు తేగెలో విద్యుత్తు బోలి
విద్యుత్తు తీగె తీగె విద్యుత్తు - మేమే దత్తుడు దత్తుడే మేము

తాదాత్మ్యమున్న భావమె త్రిమూర్తి - తాదాత్మ్య హీన భావమె జగత్తు
భావరహితుడె నిర్గుణ దత్తుడు - భావము చీమగ నున్నను లేనిదే

జగత్తులున్నను లేకున్న నొకటె - అద్వితీయుడే దత్తుడు బ్రహ్మము
గుణమన చీమయె నిర్గుణుడెప్పుడు - నిర్గుణ సగుణము లద్వితీయములె

ఆహా ! తాండవమెంత రమ్యమది - బాహ్యాత్మలలో సుందరుడు శివుడు
సుందరేశ్వరుడు వాని తాండవము - కాకుండనెట్లు సుందర మయముగ

పంచ చామరము ఛందస్సు నందు - ఏవిధి పదముల గంతులు వినబడు
ఆ విధి పదముల గంతులు వినబడు - నూపుర రవములు కర్ణ సేయములు

కాళీయ మర్ధన మందున నేనును - శివ తాండవమును చేసి చూపితిని
శివతాండవమును చూసిన పిమ్మట - అట్లు చేయమది కోరిక కల్గెను

లలితా దేవి కీర్తన

అమ్మా అమ్మా ఓ లలితమ్మా ! అమ్మా అమ్మా ఓ లలితమ్మా
శక్తివయ్యు నిరహంకారిణివే ! వాణివి లక్ష్మివి గౌరివి అనగఘవు
దత్తాంకపీఠా విరాజమానా ! (పల్లవి)

దత్తాంకపీఠా విరాజమానా !
నీ కనుబొమలవి కదలగచేయును సృష్టి స్ధితిలయములనే దత్తుడు
పరబ్రహ్మమను సింహాసనమున ఓ అధిష్టాన దేవతా ! ప్రణతి

కాపాడు తల్లి! కరుణించవమ్మ నీ ఆజ్ఞ లేక దత్త మౌనమే
శివుడు దాగుకొనె తరంగ రూపిణి ! లింగాకృతి నిను నర్చించమనుచు

లలిత నాడులను ఆవేశించిన చైతన్య శక్తి లలితయందురిల
ఆదిజీవుడవు ప్రధమోహవుగా తపించు ఊహకు దాసుదు దత్తుడు

Download this bhajan sung by Shri Dattaswami here

Saturday, March 29, 2008

మహిషుని చంపిన కనకదుర్గా కీర్తన

విజయపురాచల కాంచన దుర్గా
తాండవ మందలి చిందులవే (పల్లవి)

మహిషునిఁ జంపిన రోషము శాంతించని కారణమున గంతులతో
కరముల శూలముఁ దిప్పుచు చుట్టును విద్యుద్దీధితులుప్పతిలన్‌
కనకాభరణములెగురగ, గాజులు గలగల మోతల వెల్లువలో
విజయపురాచల కాంచన దుర్గా తాండవ మందలి చిందులవే

గిరగిరఁ దిరుగుచు, ముందుకు దూకుచు, పక్కలకెగురుచు నృత్యములో
భగభగ మండెడి నిప్పుల కణికెలు రాలగ త్రిణయన దృష్టులతో
వైశాఖ దివస మధ్యాహ్నపు వడగాలులవడి ఉచ్ఛ్వాసములన్‌
విజయపురాచల కాంచన దుర్గా తాండవ మందలి చిందులవే

క్రోధ విలఙ్ఘన తాడిత నాగ కులంబుల మెలికల దూకులతో
అవయవ వీచికలాడగ రక్తము పొంగగ ఎర్రని వెలుగులతో
కుంకుమ తిలకము స్వేదజలంబుల రేఖలుగానగు ఫాలముతో
విజయపురాచల కాంచన దుర్గా తాండవ మందలి చిందులవే

ముడి విదిలింపులు సడలగ, విరబోసిన కేశములవె పాయలుగా
ఎగిరెడి నల్లని త్రాచులు, మహిషుని అసు పవనంబుల మ్రింగెడిగా
ముఖమున రొప్పులు శ్వాసలు కస్సుమటంచును బుసబుసలైచెలగన్‌
విజయపురాచల కాంచన దుర్గా తాండవ మందలి చిందులవే

పదములనందెలు వెండివి మెండుగ ఘల్లు ఘల్లుమని శబ్ధములన్‌
పదపదమందున చేయగ నసురుల బండల గుండెలు ఖండములై
దితిసుత రక్తము ఎగురుచు చిందుచు బిందువులై ముఖమందు పడన్‌
విజయపురాచల కాంచన దుర్గా తాండవ మందలి చిందులవే

కులుకుచు శూలము నాడించుచు, కుచపర్వత కంపము లింపులుగా
పరవశమొందిన దత్తుడు చూదగ ప్రణయము పొంగగ సన్నిధిలో
నిలువగ చూచెను మధురస్మితయై శాంతించెను శాంతించెనుగా
విజయపురాచల కాంచన దుర్గా తాండవ మందలి చిందులవే

Download this bhajan sung by Shri Dattaswami here

మణికంఠ భజన

భజ భజరే భగవంతం - హరిహర పుత్రమనంతమ్‌ (పల్లవి)
మణికంఠహారం కేరళకుమారం శార్దూల వాహం వర్జిత వివాహమ్‌
శబరీ గిరీశం మహిషీ వినాశం - శాస్తార మేవం ధ్యాయమి దేవమ్‌

శివ విష్ణు తేజ స్సంయోగ భాజం - సంసారపారం శ్రుతి వాక్య సారమ్‌
సోపానమాలా మధిరుహ్యలీలా - సంకల్ప లోకం కలయంతమేకమ్‌

ఏకైక వీరం సౌందర్య మారం - యోగీంద్ర ధీరం హృత భూమి భారమ్‌
పంపా విహారం హృదయైక చోరం - దత్తావతారం మునిచిత్త చారమ్‌

ఆలీఢ కాంతం నిశ్రేణి కాంతం - వేదాంత శాంతం చిన్ముద్రయాంతమ్‌
అనాద్యనంతం మకరాంశుమంతం - జోతి స్స్ఫురంతం శిఖివజ్జ్వలంతమ్‌

Download this bhajan sung by Shri Dattaswami here

స్వామి భజనలు

ఈ భజనలు స్వామి భక్తుల కన్నులకు మహా మాయను కప్పుచు దత్త పరీక్షలను చేయుచు పాడిన భజనలు. తనను నరాధమునిగా, షిరిడీ సాయి పాదాల వద్ద నున్న కుక్కగా వర్ణించు కొనుచు, కొన్ని సిద్ధులు లభించగనే తాను భగవంతుడనని అహంకరించరాదని, సదా వినయమే దత్త ప్రీతికరమని బోధించు భజనలు.

ముంచ ముంచ కృష్ణం - వంచకం తమేకమ్‌ (పల్లవి)

1. దత్తాత్రేయం దయావిహీనం - కాశీ స్నానం కామవికారమ్‌
వేదాధ్యయనం వేశ్యా వశ్యం - బ్రహ్మధ్యానం మదిరాలోలమ్‌

2. గీతాచార్యం గోపీ జారం - మోహాతీతం రాధా మోహమ్‌
ధర్మాధారం పరదధి చోరం - యతితతిసేవ్యం రాసక్రీడమ్‌

3. దిగంబరాఖ్యం పీతదుకూలం - లక్ష్మీనాధం భిక్షుకవృత్తిమ్‌
వేదాన్తానా ముపదేష్టారం - వేశ్యావాటీ పధి సంచారమ్‌

Download this bhajan sung by shri Dattaswami here
-------------------
కిమస్తి దత్తే ? కమలే ! విముక్త శీలే, విమలే ! (పల్లవి)

వర్ష సహస్రం మహర్షిలోకే - సరసీకూలే నిరీక్షమాణే
ఆలింగితోஉయం దిగంబరాంగ్యా - సాక్షాద్దదృశే దిగంబరాంగః

(వేయి సంవత్సరములు మహర్షులు సరస్సు తీరమున వేచియుండగా దిగంబరిచే ఆలింగితుడై దిగంబరుడుగ కనిపించెను !)

యస్మిన్‌ దృష్టే విచ్ఛిద్యన్తే - సర్వే బంధా స్సుతపతిరూపాః
తదేకబంధా త్సర్వ విముక్తిః - స్వార్ధం పశ్య ప్రభుతాహ్యేవమ్‌

(ఆయనపైనే బంధమునుంచి, పతిపుత్రాదుల బంధములను తెంచుకొన్ననే సర్వ విముక్తి!. ఆయనకు ఎంత స్వార్ధము! అధికారము కలవారిట్లే ఉందురు)

ఏకాంతం న స్సాధక యోగ్యం - సముపదిశన్యో వేదాంతార్ధైః
నృత్యతి సహి నవరాస విలాసీ - బృందావన భువి గోపీ బృందైః

(మన సాధనకు ఏకాంతమును తత్త్వము ద్వారా బోధించి, తాను మాత్రము బృందావనములో రాసలోలుడై గోపీ బృందములతో కూడి గంతులు వేయుచున్నాడు!)

Download this bhajan sung by shri Dattaswami here
---------------------------------------
ఎంత దయ ! ఎంత దయ ! ఓ సాయీ !
ఇంత దయ చూపితివె ! గోసాయీ ! (పల్లవి)

కాలికుక్కనే గురువుగఁ జేసి - వేద గీతలను చెప్పించితివి !
ఉచ్ఛిష్టముఁదిని బ్రతుకు జీవిని - నివేదనార్హుని చేసితివిచట !

అంటగరానిది పిచ్చికుక్కయె - తలపై నుంచియు ఆడించితివి !
ఈ పిచ్చికుక్క కరచిన క్షణమె - బ్రహ్మఙ్ఞానము పిచ్చిపుట్టెనె?

కుక్క వచ్చునెడ శుద్ధి మంత్రములు ! కుక్కయె నాలుగు వేదములఁజెప్పె
శీలుని గృహమున భోక్తగ వచ్చియు - నల్ల కుక్కనట వెంటఁదెచ్చితివి!

బ్రాహ్మణులందరు నిను వెలివేయగ - కృష్ణ శ్వానము వేదముఁబలికెను
శ్వానము నేను కృష్ణుడు నేను - కృష్ణ శ్వానము నేనే దత్త !

Download this bhajan sung by shri Dattaswami here
-------------------
షిరిడీ కుక్కను చూడండీ ! సద్గురువుగ వచ్చాడండీ ! (పల్లవి)

దూరదూరముగ నుండండీ - పిచ్చికుక్క ఇది పోపొండీ !
కరచిన వెంటనె మీకండీ - బ్రహ్మపిచ్చి కలిగేనండీ

ఆపిచ్చి నయము కాదండీ - శాశ్వత మోక్షమె గతియండీ
జీవికి యాతన నిస్తాను - అంత్య కాలమున వస్తాను

కాశీపురమున ఉంటాను - కాలభైరవుడు అంటారు
అట్టహాసమును చేసేను - బ్రహ్మాండములే పగిలేను

కసాయి కఠినుడనేనండీ - దాక్షిణ్యమనుట లేదండీ
కర్మ ఫలములనే ఇస్తాను - ధర్మ రక్షణను చేస్తాను

నాలుగు దిక్కుల నేనుంటా - ధర్మధేనువును రక్షిస్తా
వీరభద్రునిగ ఆనాడు - దక్ష శీర్షమును తుంచాను

పాశుపతాస్త్రము నేనేను - పార్ధుని రక్షణ చేశాను
శూలము చక్రము నేనేను - దత్తుని కరముల వెలిగేను

శంఖము డమరువు నేనేను - నాధ్వని వేదము వింటేను
కుండీ మాలలు జపములు నేను - సాధన మార్గము సూచిస్తాను

బ్రాహ్మణోஉహమపి చండాలోஉహం - సాధుధేనురపి క్రూరశ్వాஉహమ్‌
శ్రీదత్తోஉహం గురుదత్తోஉహం - ప్రభు దత్తోஉహం తవ దత్తోஉహమ్‌

Wednesday, March 26, 2008

దీపావళీ జ్ఞాన దీపావళీ

దీపావళీ ఙ్ఞాన దీపావళీ - దీపావళీ భక్తి దీపావళీ
నేడే కృష్ణుని స్మరణం - రేపటి నుండియె కార్తీకం చంద్రశేఖరునికి అభిషేకం (పల్లవి)

1. హృదయమనే మట్టి పాత్రలో - ఙ్ఞానమను వత్తినుంచుమా
భక్తియను తైలము పోయుము - గురుదత్త బోధ జ్వాలతో
వెలిగించుమా స్వామికై - నీ జీవితమె ఈ దీపం

2. సంసారమె నరకాసురుడు - స్వామిపై ప్రేమయె సత్యభామ
సంసారరతియె అమావాస్య - అఙ్ఞానమె గాఢాంధకారము
భక్తి పాటలె మతాబులు - కాల్చుటయన భజన యోగము

3. రేరే జీవా ! మూఢమానవా ! - అంతరార్ధము నాలకించుమా
విషయతృణములనె భక్షించి - నిత్యము పశువైనావు
పశుపతినే మరచినావు - పశువుగ జన్మించేవు

4. అభిషేకమన ప్రేమించుట - గంగాజలమన శుద్ధ ప్రణయము
లింగమనగా సగుణరూపము - త్రిదళ బిల్వమన త్రిమూర్తి భావము
విభూతియన బ్రహ్మ ఙ్ఞానము - విశ్వేశ్వరుడన గురుదత్తుడే

5. సాత్విక భావమె క్షీరాభిషేకం - సత్సంగమె దధ్యభిషేకం
తపించు తనువే ఘృతాభిషేకం - ప్రేమయె మధువుల అభిషేకం
స్వామి పలుకులె చక్కెరల అభిషేకం

6. కొబ్బరికాయె నీ తలకాయ - పగులకొట్టుటయె వేదాంత చర్చ
కొబ్బరి నీళ్ళే నీ తియ్యని తలపులు - అభిషేకంబన అర్పణము
ద్రవ్య యఙ్ఞమున సారాంశమే - ఙ్ఞాన యఙ్ఞమని తెలియుమురా

7. నానా ఫలరస అభిషేకంబన - సర్వ ఫల సంగత్యాగము
కర్పూర నీరాజనమే - నీ మనసును స్వామికిచ్చుట
శివరతియే అగరువత్తి గంధం - నైవేద్యమే నీ ఆత్మార్పణము

8. దేవ దేవునికె నీ దేహం - వామ దేవునికె నీ వాక్కు
ఆదిదేవునికె నీ అంతరంగం - అర్పించుటయె ఆరాధన
ప్రతి క్షణము కార్తీకమాసం - ఆనందమె అమృతాభిషేకం

Download this bhajan sung by Shri Dattaswami here

Tuesday, March 25, 2008

వారిజాతమా! నా గీతమును ఆలకించుమా సావధానవై

(శంకరాచార్యునకు శ్రీ దత్త గురువు చేసిన బోధ)
వారిజాతమా! నా గీతమును
ఆలకించుమా సావధానవై ! (పల్లవి)

1. కాశీ పధిని చండాలునిగ - నాలుగు కుక్కలు వెంబడి పడగ
నన్ను జూచెను శంకర గురువు - తొలగమని నన్నాదేశించె
అపుడు పలికితి "ఆచార్యేంద్రా! - పంచభూతములన్ని తనువులు
చిదాత్మ ఒకటే పలికితి వీవె - ఏది పక్కకు పోవలె? " ననుచు
బిత్తర పోయెను శంకరుడపుడు - సాష్టాంగముగ పదముల బడియె
నీవె గురువని నన్ను నుతించె - గురువులకు గురుని నన్ను తెలియుము
జగద్గురువుకే - ఙ్ఞాన నేత్రము - తెరిపించితిని - తెరఁదీసితిని
శంకరునికే - మాయఁ గప్పితి - నన్నెవ్వరిల - తెలియగలేరు

2. జీవుడైనా దేవుడైనా కనుల గంతలు కట్టవలెను
విశ్వనాటక వేదికాస్థలి నియమమిదియే ప్రధమ సూత్రము
అవతరించును దేవుడెపుడు ప్రతి తరంబున అన్ని చోటుల
బీదవారలు ఒక్క చోటికి తన్ను చూడగ రాలేరనుచు
అన్ని గృహముల ఒక్క రూపమె కృష్ణుడుండెను వేరు వేరుగ
భిన్న రూపములుండ కష్టమే ? ఏక కాలమునందు స్వామికి
-----------------------
మహా సిద్ధిని స్తుతించు కీర్తన

ఏమున్నదే చెలీ! ఏమున్నదే
అష్ట సిద్ధులనిల దర్శించగా
ప్రభు సృష్టియే యీ విశ్వమంతా
మహా సిద్ధియె ఇది చూడవేలా (పల్లవి)

1. అదిగో చూడు సూర్యగోళము - తేజోమయము చాలా పెద్దది
దాని ముందర చిన్న వస్తువు - సృష్టిచుటయు ఆశ్చర్యమా

2. ఆద్యంతమును లేని విశ్వము - చూచిన చాలు స్వామి గొప్పను
ఊహించుటకు మహాసిద్ధియె - దాని ముందర సిద్ధులు ఎంత

3. పామరులకే అష్టసిద్ధుల - ప్రదర్శనంబు చేయుచుందును
అస్తిత్వమున విశ్వాసమును - కలిగించుటకె నీకేలనవి?

4. బ్రహ్మతేజమును విష్ణు చక్రమును - శివలింగమును చూపి యుంటిని
పసి పాపలకె ఆ వింతలుగ - నీ కేలనే? పాలబొప్పివె?

5. ఙ్ఞానమార్గము నందున నడచి - అందుకోవె అందని ఫలము
భక్తి రస సుధ మధురంబదియే - నా తత్త్వమని తెలియుము అనఘా

Download this bhajan sung by Shri Dattaswami here

Sunday, March 23, 2008

శ్రీహరి శయ్యా ! శివుని హారమా

(సుబ్రహ్మణ్య స్వామివారు శ్రీ దత్త భగవానుని శిష్యులే కాదు సాక్షాత్తు దత్త స్వామి యొక్క బాహ్య వేషధారియే. నాగుల చవితి నాడు స్వామి ‘పున్నాగవరాళి’ రాగంలో ‘ఉరగేశ వందనం’ అని కీర్తించారు.)

శ్రీహరి శయ్యా ! శివుని హారమా ! - వాసుకి నామా ! ఓ ఆదిశేషా !
పుట్టలో నున్నట్టి పుణ్యాల మూర్తీ! - నాట్యమాడుమా నాగేంద్ర స్వామి!

ఉరగేశ వందనం - భుజగేశ వందనం
ఫణిరాజ వందనం - నాగేంద్ర వందనం (పల్లవి)

1. తరనాననాననం తరనాననాననం - అనురాగనాదమే నిను లేపునయ్యరో !
బుసకొట్టి దూకగా పరుగెత్తు పాపమే - ఇక పాలు త్రాగుమా శ్రిత రక్ష సేయుమా

2. బహువక్ర యానమా! మెరిసేటి నాగమా! - శిరమందు రత్నమే వెలిగేను దైవమా !
ననుబ్రోవలేవవా తలవిప్పి ఆడవా - అభయమ్ము నీయవా అహిరాజ ! వందనమ్

3. మహినెపుడు మోతువే శ్రమనంతసైతువే - హరిశయ్య వైతివే శివకంఠ హారమా
నిను పూజ సేయుచో స్ధిరయోగ లబ్ధియౌ-ఫణినాధ! పాహిమాంఅహిదేవ! రక్షమాం

4. కరుణా సముద్రమా! వినుమయ్య నామొరన్-బహుపాప రూపినై ఇలనుంటినాదొరా!
బుసచిమ్ము జ్వాలతో అఘమెల్ల భస్మమౌ- నను పావనాత్మగా నాగేశ! మార్చుమా!

5. బలరామ దేవుడా! బలమంత నీదెగా - హరి నీకు తమ్ముడై పదమందు మ్రొక్కెనే
రఘురామ సేవలో - నినుమించి లేరుగా - నిదురించలేదుగా నిలుచుండి లక్ష్మణా !

6. భువిలో పతంజలీ ! నవయోగ శాస్త్రమే - నీ ముఖమునుండియె వెలువడెను దేవరా !
వ్యాకరణ భాష్యమే పలికితివి పండితా! - గురుదత్త దేవుడా! ఫణి బాహ్య వేషుడా !

7. గురులక్ష్మణాకృతీ! రచియించినావుగా-హరిభక్తి భాష్యముల్ కలిలోన నాయనా!
కరుణించవేలరా కమనీయ రూపుడా - కలమైతి పాటకున్ కవి నీవె దైవమా !

8. నీవాడు నేనెరా నావాడు నీవెరా - గతి నీవు మాత్రమే గతి వేరు లేదురా !
దయఁజూపరానిచో దయ చేసి నాకికన్ - విషమైన నిమ్మురా నా తండ్రి శేషుడా

9. హరిదేహమంతయున్ నీ మీదనుండగా -ఆనందవార్ధిలో మనమందు తేలుచున్
వేవేల పడగలే కంపించుచుండగా - క్షీరాబ్ధినుంటివే క్షీర ప్రియుండవై

10. జగమంత స్వామి! నీ బుసమాత్రమే కదా - తలనుంచి మోయుచున్ పాలించుచుంటివే
బుసలోని జ్వాలతో జగదంత మనుగా - ఫణిరాజ ! నీవెగా శ్రీ దత్త బ్రహ్మమే

11. ఒకసారి దూకుతో ఒకసారి మెలికతో - ఒకసారి వంపుతో ఆడేవు సొంపుగా
నీ నాట్యమందునె అందాలు చిందునే - తల మీది రత్నమే కిరణాలు చిమ్మునే

12. పాతాళ నాయకా! నే తాళ జాలరా - రక్షింప రమ్మురా నిను విశ్వసింతురా
నేవె కాదన్నచో నేనేమి చేతురా - నా భాష్పవృష్టిలో నీ పుట్ట కరుగురా !

13. పాలారగించరా పాపాల కాల్చరా - పరమేశ్వరా! హరా ! ఫణిలోక నాయకా!
రోగమ్ముఁబాపరా యోగమ్ము నీయరా - నారాయణాశ్రయా నాగేశ్వరా దొరా !

14. చైతన్య శక్తియౌ కుండలిని నీవెగా - అనఘయను పేరుతో పరమాత్మ దేవిగా
చక్రాల దాటెదవు వంకరగా పోవుచున్ - గెలిచెదవు మాయతో మాయలను సర్పమా!

15. చంపెదవు కచ్ఛతో పగబట్టి దుష్టులన్ - కాచెదవు దీక్షతో శ్రితులైన శిష్టులన్
ఓ నాగ నాయకా! ఒకసారి చూడుమా - శరణార్ధి నేలుమా మణిదీప భోగమా !

16. అలవోలె దొర్లుమా తల విప్పి పొర్లుమ - తళ తళ మెరుపులా నాట్యమాడేవుగా
హిమశైల గంగలా దూకేవు నాగమా - అలలయ్యె మెలికలే ముత్యాల సరముగా

17. జగదాది సృష్టికై ప్రధమోహ నీవెగా - శివలింగ రూపివై చైతన్య శక్తివై
ప్రచలత్తరంగమై జగదాద్యరంగమై - ఙ్ఞానులకు బుద్ధిలో భాసింతు వెప్పుడున్

18. నిను నాగ దేవతా బిగి కౌగిలింతలో - పెనవేసి ఆడెనే సొరబూరనూదగా
నటరాజ పార్వతీ నవనాట్యమాయెనే - రససాగరంబులో అలలయ్యె మీరలే

19. మెలివేసి కొంటిరె అనురాగ పాశముల్ - వలపంత చూపుచున్ పలుమార్లు ఆడిరే
తలలందు రత్నముల్ తళతళా వెలుగులన్-విరజిమ్ము చుండగా నవకాంతి చక్రముల్

20. బహునాట్య రీతులన్ శ్రమఁజెందినావుగా - ముకుళించిచుట్టగా నిదురించు పుట్టలో
కనురెప్ప వేయకే కాపాడుచుందువే - లోకాలఁ జూచుచున్ నవయోగ నిద్రలో

21. అగజాకుమారకా! కరశక్తి భల్లకా! - శుభ షణ్ముఖాబ్జకా ! గురుదత్త శిష్యకా !
శిఖివాహ సంచరా ! హతతారకాసురా ! - హిమశైలమందిరా ! లఘుకోప సుందరా !

Saturday, March 22, 2008

సహ్యాద్రి వాసిని నేను

సహ్యాద్రి వాసిని నేను
సాక్షాత్తు దత్తుడు నేను
సాధన మార్గము గురువుగ చెప్పెద
స్వామిగ నమ్మిన నడిపిస్తాను (పల్లవి)

1. ఙ్ఞానమె నా సహజ సత్య స్వరూపం - ప్రేమయే నా సహజ సత్య సౌందర్యం
ఈ రెండె నను బట్టగా గుర్తులిచ్చట - నా అలంకారాలె ఈ అష్ట సిద్ధులు

2. దైత్యపుత్రులు గూడ మొండి తపములుఁజేసి - నానుండి పొందుదురు అష్టసిద్ధుల నిచట
అవె గుర్తులని తల్చు వారలఙ్ఞానులే - వాటిచే కోర్కెలను తీర్చుకొను లుబ్ధులే

3. నను నాస్తి యనువాడు నరకేమేగేను - నిరాకారమర్చింప దుఃఖమును పొందు
సాకారమర్చించి సంతృప్తి చెందు - నరాకారు నర్చింప ఆనంద సిద్ధి

4. పెనుమాయ నన్నెపుడు ఆవరిచియెయుండు-పెను పరీక్షల బెట్టు నెట్టు జీవులనెపుడు
కోటానుకోట్లలో ఏ ఒక్క జీవియో - మొండిగా ననుబట్టి బ్రహ్మత్వమును బొందు

5. వాక్కాయమనములను పరువు ధర్మముల - నా కొరకు త్యాగంబు చేయ సంన్యాసి
కాషాయ వస్త్రములు చందాలు కీర్తి - పెద్ద సంసారములు హేమ పాశములు

6. ఆధ్యాత్మ మార్గమును బోధించలేరెవరు - యోగి రాజును నేను బోధించినట్లుగా
సర్వార్పణ త్యాగ కర్మ సేవయు లేక - ఙ్ఞాన భావము భక్తి వాక్కులును వంచనలె

వినరా ఓ జీవా ! దత్తుని కనరా ఓ జీవా !

దత్త గురు తత్త్వ బోధ కీర్తనలు

వినరా ఓ జీవా ! దత్తుని కనరా ఓ జీవా !
నరాకారుడు నరుల కోసమె పాడుచున్నాడు (పల్లవి)

చింతల బురదల మునుగుచునుందురు జీవవరాహము లోయన్నా
నీ ప్రేమసుధల తెలియగలేరిల వీరలగతి ఇంతేనన్నా
దారాతనయుల, ధనముల తపనలు చిట్టచివరివరకోయన్నా
కాలకింకరులు ఎదురుగ నిలువగ మొత్తుకొందురపుడోయన్నా
ప్రయాణమగునెడ ధనములు సుతులును రక్షించలేరు రామన్నా
నీప్రేమామృత నామగానమే రక్షించగలదు రంగన్నా
ఆశాపాశము మొదలును చివరను లేనిది చుట్టును కృష్ణన్నా
కంఠమునందున కాలుడులాగగ ఉచ్చుబిగియునో దత్తన్నా
చెప్పలేదనుచు చెప్పకుండుటకు చెప్పితినిప్పుడు కొండన్నా
చెప్పిన చెప్పక యున్నను ఒక్కటె బాధ్యత తీరెను హరియన్నా

నేనను భావమె బ్రహ్మరాక్షసుడు మూలబీజమదె బ్రహ్మన్నా
నాకనుకోరిక బ్రహ్మరాక్షసియె వానిభార్యయగు విధి అన్నా
నావారు నావి అనుభావంబులు వారల సంతతి వెంకన్నా
ఈ కుటుంబమే నరులను గృహముల నివసించుచుండు హరియన్నా
భగవద్గానమె వారల నెపుడు పారద్రోలునిల మల్లన్నా
గానమునాపిన మరల చేరుదురు వారలయిళ్ళను రుద్రన్నా

కర్తవ్యంబుల మానుకొమ్మనవు వేదాంతంబులు వెంకన్నా
విశ్రాంతి విడిచి భజన బోధించవవియు హరియన్నా
కర్తవ్యంబులు విశ్రాంతి పోను మిగిలిన సమయమె బ్రహ్మన్నా
చాలు చాలు నీ కరుణను పొందగ నరుడు తరించగ మల్లన్నా
వ్యసనము లందున కాలశక్తులవి వ్యర్ధము లయ్యెడి రామన్నా
ఆ కాలశక్తి నీ కర్పించిన చాలు చాలు గద కృష్ణన్నా
వ్యర్ధ భాషణము చలనచిత్రములు నవలల చదువుట దత్తన్నా
వ్యసనము లివియే ఇహపర దూరము లివె పిశాచములు మూడన్నా
రంభయు మేనక ఊర్వశి యనగా అప్సరసలివియె కొండన్నా
నిను చేరు తపము నంతము జేసెడి మారు రూపములు ఇవెయన్నా
పాఠము చెప్పుచునుండగ గురువిట సాయము చేయును వెంకన్నా
పరీక్ష వ్రాయగ సాయము చేయడు కఠినతనుండును హరియన్నా
మర్త్యలోకమున అవతారమెత్తి బోధించు నెపుడు మల్లన్నా
పరలోకములో విచారణ సేయ పరుషుడు పలకడు రుద్రన్నా
ఇచ్చట ఇప్పుడె వాని వాడుకొన యుక్తము నరులకు కొండన్నా
కాలము దేశము మారిపోవునెడ తారుమారగును దత్తన్నా

హంస లేవగనె అచటకు వత్తువు పదిదినములుండ ఓరన్నా
సింహాసనమున ఆసీనుడైన నన్ను చూచెదవు ఓరన్నా
మనస్వామి యనుచు సంతోషింతువు పరిస్ధితి వేరు ఓరన్నా
కాలభైరవుని నొప్పించలేను పక్షపాతమున ఓరన్నా
నిష్పక్షపాతముగనే తీర్పును జీవులకిచ్చెద ఓరన్నా
న్యాయాధిపతిగ నన్ను చూచెదరు నిర్నిమేషులే ఓరన్నా
నేను చెప్పినది ఇచ్చట చేయక అచ్చట నిలచిన ఓరన్నా
నేనేమి సేతు నానియమునకు నేనె బద్ధుడను ఓరన్నా
సేవల నందిన కృతఘ్నుడనుచు నన్ను దూరకుము ఓరన్నా
నీ సేవ ఫలమె బోధించుచుంటి నీవెంటబడుచు ఓరన్నా
ఇంత విపులముగ చెప్పలేదు ఏ అవతారమునను ఓరన్నా
తెలిసియు తెలియనివానిగ నీవిట నటించబోకుము ఓరన్నా
సృష్టి స్ధితి లయ కారణ మొక్కటె బ్రహ్మమని చెప్పు బ్రహ్మన్నా
వేదములన్నియు, వేరు వేరుగనె త్రిమూర్తులుండగ హరియన్నా
సృష్టికి బ్రహ్మము స్ధితికిని విష్ణువు లయమునకు హరుడు వెంకన్నా
వేరువేరుగనె కనపడుచుందగ బ్రహ్మము ఒకటె ఎట్లన్నా

అని ఆలోచించిరి తపముల చేసిరి ఋక్షశైలమున రుద్రన్నా
ఋషులు మహర్షియు అత్రియు తపించ త్రిమూర్తులు వచ్చిరోయన్నా
బ్రహ్మము ఒక్కటి మీరు కాదనుచు వాదించెనత్రి దత్తన్నా
త్రిమూర్తి ముఖముల దత్తుడు బ్రహ్మమె గోచెరించెనట హనుమన్నా
ఒక్కవ్యక్తియగు దత్తుడు ఒక్కటె బ్రహ్మమె శ్రుతి సరియేనన్నా
మూడు ముఖములవి మూడుపనులిట చేయును ఒక్కడె గరుడన్నా
వేద సమన్వయమయ్యెను దత్తము దత్తమనె అత్రి శేషన్నా
దత్తము బ్రహ్మము చిక్కెననియెగద దత్తపదార్ధము గణపన్నా
వేదప్రమాణ సిద్ధ బ్రహ్మము దత్తుడొకడే లలితమ్మా
అన్యరూపముల వేద సమన్వయ మెట్లు కుదురునో దుర్గమ్మా

దారా పుత్రుల సహజముగ నెట్లుప్రేమించెదవో ఓరన్నా
అట్లే నాపై సహజ సత్య ప్రేమనుంచుమిల ఓరన్నా
కాల దేశములు విధానములేదు సత్యప్రేమల ఓరన్నా
ఎప్పుడు ఎచ్చట ఏవిధినైనను ప్రేమవ్యక్తమగు ఓరన్నా
తమ సుఖసాధనమగు నిను తమకై ప్రేమింతురిలను ఓరన్నా
దారా పుత్రులు సైతము స్వార్ధమె లోక బంధములు ఓరన్నా
నీ నుండి పొందవలసిన దేమియు స్వామికి లేదిల ఓరన్నా
నీకొరకై నిను ప్రేమించు స్వామి నిస్వార్ధుడతడు ఓరన్నా
చలన చిత్రనటు డంతమునొందగ వీరాభిమాని ఓరన్నా
ఆత్మదహనమును చేసుకొనెనొకడు భక్తిమార్గమదె ఓరన్నా
నటుని నుండి నొక పైసయు పొందక స్వధనమె వ్యయించె ఓరన్నా
నటుని ఆర్జితము నంతయు మ్రింగిరి వాని భార్య సుతులోరన్నా
నటునే దహనము చేసిరి చావగ సిద్ధము కారిల ఓరన్నా
వీరలె స్వామికి వేశ్యాభక్తులు స్వార్ధపూజలివి ఓరన్నా
వీరాభిమాని మార్గమె గ్రాహ్యము లక్ష్యము తప్పక ఓరన్నా
లక్ష్యము స్వామిని చేయుము మార్గమువానిదె ఉత్తమ మోరన్నా

Friday, March 21, 2008

ఎంతోదూరం బ్రహ్మపదం - ఓ జీవా !

ఎంతోదూరం బ్రహ్మపదం - ఓ జీవా !
ఇంకా ఎంతో దూరం బ్రహ్మపదం (పల్లవి)

కన్నుల చంపుము - చంపుము చెవులను జిహ్వను చంపుము .. వారే శత్రులు-
విషయాకర్షిత మింద్రియసంతతి నాపై మనమును నిలువగ నీయదు ఎంతోదూరం

నన్ను చేరిడి లక్ష్యము నీకూ, చేసే సాధన దాని విరుద్దము, మంట జేసెడి
లక్ష్య సాధనకు, నిప్పుల జలము పోసిన రీతిగా ఎంతోదూరం

ఏది విందువో, ఏది చూతువో ఏది పల్కుదువో, అదియే నీలో
జీర్ణమగును, నీదగు తత్త్వము ఆలోచింపుము, దీనిని చాలును ఎంతోదూరం

మొహమాటంబను మాటను వదలుము కఠిన మనముతో దీక్షను బట్టుము
చూడకు దేనిని, వినకుము నెవ్వరి పలుకకుమందరి పరిహరించుము ఎంతోదూరం

పిచ్చివాడవని పలికెడు వారల పిచ్చివారలని తెలియుము మదిలో
వారలె యమపురి కేకలు పెట్టగ, ఇంద్రియనిగ్రహ నిశ్చలబుద్ధిని
నాపైనుంచుము నిమిషనిమిషమును నన్నే చూడుము నన్నే వినుమూ
నన్నే పలుకుము ఇదియే మార్గము ఎంతోదూరం

జగతిని వదలుట మోక్షము సుమ్మీ నన్నే తలచుట సాధన సుమ్మీ
నన్నే చేరుట కైవల్యంబని పండితులందురు, సత్యంబిదియే ఎంతోదూరం

----------------------------
ఏమి సేతురా జీవా ! నేనేమి సేతుర?

ముక్తినొసగమని కాళ్ళపడేరు బంధము తెంచిన ఏడ్చేరు ! ఏమి
మహిమల చూపిన గారడియందురు చూపకున్న నామాట వినరు. ఏమి
ఇహమూ కావలె మోక్షము కావలె భోగము కావలె యోగము కావలె ఏమి
మనిషిగ వచ్చిన పొమ్మంటారు సొమ్ములు పెట్టిన నవ్వెదరు ! ఏమి
-----------------------------
ఎక్కడినుండి వచ్చావో !

మరల ఎక్కడికి పోతావో నీకేమి తెలియదురా. జీవా !
ఈ మధ్య క్షణకాలము లోపల మిడిసిపడి ఎగిరెదవేలా? ఎక్కడి
మిద్దెలు మేడలు పుత్రులు బంధులు క్షణమున పటపట తెగిపోతారు. ఎక్కడి
జన్మము నరకము! మరణము నరకము తదుపరి నరకము చెప్పగనేలా? ఎక్కడి
నీ సంగరి తలచిన నాకే జలదరించును మొద్దువలె వుంటావేల ? ఎక్కడి
కరుణాసాగర దత్తుని పాదము గట్టిగ పట్టిన భయపడనేలా ? ఎక్కడి

Thursday, March 20, 2008

ఇంద్రాది దేవతలకైన నా మాయ దాటంగ తరమె

ఇంద్రాది దేవతలకైన నా మాయ దాటంగ తరమె ? (పల్లవి)

1. అవతరించెద ధరణి నెపుడు - భిన్న పాత్రల రసము కొరకు
మీ తోడ దొంగాట లోన - క్రీడించుచున్నాను నేను

2. పాత్రలో దాగినను నన్ను - నా రూపమును చూచి పట్టు
మీ తోడ క్రీడించుచున్న - దొంగాట ఇదె పట్టుకొనుడు

3. పాత్ర వేషములోన జగతి - నా సత్య రూపంబు దాగు
నా రూపమే ఙ్ఞాన ప్రేమ - నా సొమ్ము లష్ట సిద్ధులిల

4. నను పట్టగలవాడు లేడు - నను గట్టు పాశమ్ము ప్రేమ
ప్రతిఫలాపేక్ష లేకున్న - వానికే దాసుండ నగుదు

5. మోక్ష కామము గూడలేక - నన్నెపుడు సేవించు వాడు
అద్వైత కైవల్యమునకు - మిన్నయౌ నా స్వామి యతడు

6. మహా మాయచే తిరుగు - ఏడేడు లోకాలు ఎపుడు
ఓ జీవ! నీవెంత తెలిసి - వినయమ్ముతో బ్రతుకు మిలను

Download this bhajan sung by Shri Dattaswami here
----------------------
వందేஉతి రమ్యం విశ్వైకగమ్యం
ఉన్మత్త దత్తం గురు దేవమ్ (పల్లవి)

వేదాంత సారం నానావతారం - భక్తోపకారం భజ దత్తమ్
సంసార పారం రుద్రాక్షహారం - నీహార గౌరం భజ దత్తమ్
కాషాయ చేలం పాత్రాక్షమాలం - ఆమ్నాయ మూలం భజ దత్తమ్
జ్వాలక్షి ఫాలం ఢక్కా త్రిశూలం - కంఠాహి నీలం భజ దత్తమ్
పాదాంత శక్రం విచ్ఛిన్న నక్రం - శ్రీ శంఖ చక్రం భజ దత్తమ్
కందర్ప రూపం సౌందర్య దీపం యోగీంద్ర భూపం భజ దత్తమ్
మంత్రాత్మ బీజం తంత్రార్ధ భాజం - శ్రీ యంత్రరాజం భజ దత్తమ్

Download this bhajan sung by Shri Dattaswami here
--------------------
ఉన్నాడయా దత్తుడున్నాడయా
అవతారముల నెత్తుచున్నాడయా
కన్నులకు కనిపించుచున్నాడయా
మనతోడ మట్లాడు చున్నాడయా (పల్లవి)

1. వాణియు లక్ష్మియు గౌరియు అనఘయే అనఘా పతిగ వెలుగుచున్నాడయా
కీర్తించి సేవించి ధ్యానించు భార్యలను వేరు పేరుల పిలుచుచున్నాడయా

2. బాహ్య స్వరూపాన కనిపించుచున్నను అంతః స్వరూపాన దాగేనయా
అంతః స్వరూపంబు ప్రకటితము చేసిన ఆనందమున నరులు రాలేరయా

3. ఙ్ఞాన ప్రచారంబు సేయంగ స్వయముగ దత్త గురుడే వచ్చుచున్నాడయా
జీవ రూపాంతరుండు జీవ దేహములందు వ్యాపించ ఆ రెండు తానేనయా

4. మాయతో గట్టిగ కళ్ళ గంతలు గట్టి మన మధ్యనే మసలుచున్నాడయా
మాయ మాటలు జెప్పి భ్రాంతిని కలిగించి మన తోడ మాట్లాడు చున్నాడయా

5. అనుమాన విశ్వాస డోలికల నెక్కించి నిజ భక్తులను ఊపుచున్నాడయా
అష్ట సిద్ధుల జూపి విశ్వాసమేర్పరిచి ఙ్ఞాన బోధలు చేయుచున్నాడయా

Download this bhajan sung by Shri Dattaswami here

దత్తస్వామిని నేనేరా - నాకే దాసోஉహమ్మనరా

దత్తస్వామిని నేనేరా - నాకే దాసోஉహమ్మనరా (పల్లవి)

1. ఉద్ధరించెదను నిన్నుపుడే - కండ్ల గంతలను విప్పెదను
ఙ్ఞాన యోగమను దీపముతో - భక్తి మార్గమున కదులుమురా

2. ఏ జీవునికై మురిసితివో - వర్జించి నాడు నిను వాడు
గుడ్డి మోహమును వదులుమురా - ఇప్పటి కైనా తెలుయుమురా

3. నిత్యము నిను కని పెట్టెదను - నీ శ్రేయస్సునె కోరెదను
జన్మ జమలను తోడగుచున్ - నీ వెంట నుంటి నీడవలెన్

4. చేతి నూపి నైవేద్యములన్ - నా కర్పింతువు మాయావీ
నా నుండి వరము కోరెదవు - సత్యమైన సిరి సంపదలన్

5. దొంగాటలాడ మనసాయె - నర రూపములో దాగితిని
గుర్తించినారు, నిమిషములో - అరటి తొక్కపై కాలిడిరి

Download this bhajan sung by Shri Dattaswami here
----------------
దత్తాత్రేయ మునీంద్రులము - అనసూయాత్రి సుపుత్రులము (పల్లవి)

1. నిర్వికారులము! నిత్యులము - నిరంజనులమై నిలచితిమి
మానావమానములు రెండు - సంతోషదములె మాకెపుడు
భక్త రక్షణమె మా వ్రతము

2. నిరంతరము సంచారులము - ఙ్ఞాన భిక్షలను పంచెదము
యోగులము మరియు భోగులము - భక్త కర్మ ఫల రోగులము
అపార దయా సాగరులము

3. విశ్వ కర్తలు, భర్తలును - విశ్వ హర్తలు త్రిమూర్తులము
అద్వితీయ - అవధూతలము - ఆద్యంత మధ్య రహితులము
ఆనందార్ణవ రూపులము

4. గుర్తించలేరు మమ్మెవరు - మాయలె చేష్టలు వేషములన్
మా దయ గలిగిన చిక్కుదుము - భక్తి సన్నగిల జారుదుము
జారిన చిక్కము ఎన్నటికిన్

Download this bhajan sung by Shri Dattaswami here
----------------
దత్తులోరమండీ - భిక్షాదానము చేయండీ (పల్లవి)

1. బాలునిలో వికలాంగునిలో - వృద్ధునిలో రోగగ్రస్తునిలో
ఆవేశించి అడిగెదమండీ - మీ త్యాగ పరీక్షను చేస్తామండీ

2. సోమరి పోతులు కొందరు - మా పేరు చెప్పి అడిగెదరండీ
వారికి భిక్షలు వద్దండీ - పని చేసే పధమును చూపండీ

3. ఙ్ఞాన విచక్షణతో - పాత్ర దానమును చేయండీ
యోగ్యునకు ఇచ్చుట పుణ్యంబండీ - అయోగ్య దానము పాపంబండీ

Download this bhajan sung by Shri Dattaswami here

సాక్షాద్దత్తాత్రేయులము

సాక్షాద్దత్తాత్రేయులము - గురువులదిద్దగ వచ్చితిమి (పల్లవి)

1. సత్యం ఙ్ఞాన మనంతం బ్రహ్మ - రసోవైస ఇతి శ్రుతి వాక్యాత్
ఙ్ఞానమె బ్రహ్మము ప్రేమయె బ్రహ్మము - అష్ట సిద్ధులివి మా సొమ్ములేను

2. ఙ్ఞాన భాస్కరుడు దత్తాత్రేయుడు - తత్త్వాంబరమున గోచరించగా
మాయగురువులిల అంధకారములు - పటాపంచలై పారిపోవగా

3. క్షుద్ర మాంత్రికులు దానవాధములు - మొండి బిడ్డలిల మొండి తపస్సుల
తండ్రి సొమ్ములను పొంది ధరించిన - ఙ్ఞాన ప్రేమల పొందగ సాధ్యమె

4. సొమ్ముల చూపిన బ్రహ్మమగుదురె - ఙ్ఞాన ప్రేమలు మా స్వరూపములిల
స్వరూపము చేత గుర్తించు రాణి - రాజును కిరీటము చేత కాదుగ

5. ఇంద్ర పదవిలో నహుషుడు నిలచిన - వానిని శచి పతిగా నొప్పుకొనెనె
పద్మ నాళమున దాగిన ఇంద్రుని - స్వరూపము చేత గుర్తించె సతియు

6. స్వార్ధముల దీర్చు సిద్ధులఁ జూపియు - జీవులనాకర్షించిన మాత్రము
సొమ్ముల కోసమె వేశ్యలు వత్తురు - భగవద్గుణాభిమానము నటనయె

7. సత్య భక్తుడిల సీతమ్మ బోలి - సొమ్ములు లేకున్నను పతిరూపమె
హృదయాకర్షణమై వని కేగెను - ఙ్ఞాన ప్రేమలె బ్రహ్మ రూపమగు

8. స్వార్ధముఁదీర్చెడి సిద్ధుల జూపిన - వచ్చెడి భక్తులు నాకేల కోట్లు?
స్వార్ధరహితుడై నా కొరకె వచ్చు - ఒక్క భక్తుడిల దొరికిన చాలును

9. లారీలు ఏల? గులకరాళ్ళు ఇవి - కోహినూరు వజ్రమొక్కటి చాలును
ఎండమావులీ భక్తుల ప్రేమలు - గంగా జల కణమే సద్భక్తుడు

----------------------------
మూడు తలలోణ్ణిరా నేను - మూడు లోకాల ఏలికనురా
చూచి చూడలేని జనులారా - చూచి పోదామని వచ్చానురా (పల్లవి)
1. మీ బుద్ధులన్నిటిని చూశానురా - ఆనందమానందమాయెనురా
ఒకరి నొకరు దోచుకుంటూనే - ఎంత ముచ్చటగ ఉన్నారురా

2. కాల కర్మలను చక్రముల - క్రిందపడి నలిగేటి చీమలారా !
దేవుడెచ్చటయనుచు అడిగేరు - మాతెలివి చూడమని మురిసేరు

3. మా ప్రతిభ చూడమని పలికేరు - యంత్రముల కనిపెట్టినారు
అవి జీవ నాశమై నిలువ - నా సృష్టియే మంచిదనిరి !

Download this bhajan sung by Shri Dattaswami here

Tuesday, March 18, 2008

దత్తాత్రేయా ! త్రిమూర్తి రూపా !

దత్తాత్రేయా ! దత్తాత్రేయా !
దత్తాత్రేయా ! త్రిమూర్తి రూపా (పల్లవి)

నీవే బ్రహ్మవు - నీవే విష్ణువు - నీవే శివుడవు - దత్తాత్రేయా
వాణీ లక్ష్మీ గౌరీ నాధా ! దత్తాత్రేయా త్రిలోక పూజ్యా !
శంఖీ చక్రీ ఢక్కా శూలీ ! కుండీ మాలీ దత్తాత్రేయా !
కాశీ స్నానము - మాహురి భిక్షయు - సహ్యము శయ్యా - దత్తాత్రేయా !

ఒకచో యోగిగ - ఒకచో భోగిగ దర్శనమిచ్చే దత్తాత్రేయా !
ధర్మమె ధేనువు - శ్రుతులే కుక్కలు వెంటబడిన ఓ దత్తాత్రేయా !
దేవదేవతలు - ఋషులును సిద్ధులు గ్రహములు నీవే దత్తాత్రేయా !
యోగ భ్రష్టుని - నను కాపాడుము దయతో దేవా దత్తాత్రేయా !
--------------------

శ్రీ నృసింహ సరస్వతిస్వామి స్తోత్రం
-------------------
శ్రీ నరసింహ సరస్వతీ యోగిరాజం భజేహమ్

కర్ణాంత కమల నయనం కనకవర్ణ చ్ఛాయం
వటవృక్షాధః శిలాతలోపరి పద్మాసనాసీనమ్ శ్రీ నరసింహ సరస్వతి

నిజ తను ధృత కాషాయాంబర సంవృతోత్తమాంగం
కంఠ మాలాయిత పావన రుద్రాక్షహారమ్ శ్రీ నరసింహ సరస్వతి

అనేక లీలా మహిమ ప్రదర్శన సద్గురు మూర్తిం
హరిహర బ్రహ్మాత్మక శ్రీ దత్తాత్రేయ పూర్ణావతారమ్ శ్రీ నరసింహ సరస్వతి
-----------------------
దత్తాత్రేయం దత్తాత్రేయం - దత్తాత్రేయం కోజానాతి ?
బ్రహ్మర్షిర్వా దేవో వాస్యాత్ - దత్తాత్రేయం కోజానాతి ? (పల్లవి)

1. పూర్ణ వినోదం మాయాలోలం - మూలస్య మూల మనూహ్య తత్త్వం
సద్గుణ దుర్గుణ లీలా కేళిం - బ్రాహ్మణోత్తమం చండాలంచ

2. పరమ కఠోరం బాహ్యాకారం - కరుణా సాగర మంతస్సారం
నిందా స్తోత్రై రలిప్త మేకం - క్రీడయంత మిహ కృతావతారమ్

3. దత్తం ఛిన్నం దత్తం ఛిన్నం - మూఢా ఏవం వదంతి లోకే
మాయా బంధా స్సర్వే ఛిన్నాః తదీయ దృష్ట్యా కైవల్యాయ

4. ధర్మ బద్ధ మపి ధర్మాతీతం - ఙ్ఞానానందం రస స్వరూపం
కర్మణిమగ్నం నకర్మ బద్ధం - కర్మ ఫలానాం ధాతారంతమ్
--------------------

Sunday, March 16, 2008

అంతర్యామీ ! దత్తాత్రేయా

అంతర్యామీ ! దత్తాత్రేయా ! అరచితినీ ! మొరిగితినీ !
ఎప్పటికప్పుడే నీ పలుకులను
అరచి అరచి మొరిగి మొరిగి - నీ పద కమలములనిదే
వ్రాలితినీ అంతర్యామీ దత్తాత్రేయా (పల్లవి)

1. మారరు జీవులు మారరు జీవులు - నా వాలము వలె వంకరలు
క్షణికపు మార్పులు మరల పాతవె పద్ధతులు - అంతర్యామీ ! దత్తాత్రేయా

2. పాపక్షయ సులభ మార్గమును వినరు ఎంత చెప్పిననూ
వ్యర్ధములగు కష్ట మార్గములనే శ్రమపడి చచ్చెదరు - అంతర్యామీ ! దత్తాత్రేయా

3. కృతయుగమంతయు అత్రి తపించిన క్షణ దర్శన మిచ్చితివి
పిలువకయె వచ్చి నాతోనెప్పుడు ముచ్చటింతువు నా ప్ర్రాణ సఖా
అంతర్యామీ ! దత్తాత్రేయా

4. నా తోడ నడచి నాతో నిత్యము ఐక్యము చెందితివి !
దేవతలకును ఋషులకును అబ్బని భాగ్యము నా కిచ్చితివి
అంతర్యామీ ! దత్తాత్రేయా

5. హంసను పంపుము గరుడుని పంపుము నందిని పంపుము ఈ లోకమునకు
నారద గణపతి హనుమదాదులు పరమ పావనులు కలరు గదా నీ సేవలకు
అంతర్యామీ ! దత్తాత్రేయా

6. చాలు చాలునిక కొంత విశ్రాంతి నొసగుము స్వామీ
నీ రూపములో ఇక ఐక్యముగానీ నా రూపము ! అంతర్యామీ ! దత్తాత్రేయా

Download this bhajan sung by Shri Dattaswami here

కంటి - సత్యమును గంటి

కంటి - సత్యమును గంటి ! నే పరమ సత్యమును గంటి !
ఎల్ల దేవతల వేషాల నటుడగు ! శ్రీ దత్త బ్రహ్మమును గంటి ! (పల్లవి)

1. మూడు ముఖముల నారు చేతుల వెలయు దేవుని
ముద్దులొలికెడి మూడు మూర్తుల వేషధారిని కంటి
పాత్రమాలలను గంటి ! ఢమరు శూలముల గంటి !
శంఖ చక్రముల గంటి ! కాల జటలను గంటి !
కమల లోచనుని గంటి ! కాషాయ ధారిని గంటి !
ఙ్ఞాన బోధకును గంటి ! జీవ తారకుని గంటి !
విధి గంటి ! హరి గంటి ! హరు గంటి ! గురు గంటి !
కామధేనువును గంటి ! కాల భైరవుల గంటి !

2. నాల్గు వేదములైన కుక్కలు మొరిగి తెలుపగ వింటి !
సత్యమును వింటి - నే పరమ సత్యమును వింటి !
సృష్టి పాలన విలయ కారకుడొక్కడేయని వింటి !
నా కన్నులను నలుపు కొంటి !
మాయ గాదిది మరల మరలను కంటి !
శ్రీ దత్త గురు పాదముల నంటి , శ్రీ దత్త గురుదేవులను గంటి !
కంటి, సత్యమును గంటి ! నే పరమ సత్యమును గంటి !

Download this bhajan sung by Shri Dattaswami here

Saturday, March 15, 2008

దత్తుడు దిగి దిగి వస్తున్నాడు

దిగి దిగి వస్తున్నాడు !
దత్తుడు దిగి దిగి వస్తున్నాడు (పల్లవి)

1. మునులను వదలి గొల్లల వద్దకు - ఆశ్రమము వీడి రేపల్లె లోకి
కాషాయము వీడి జిలుగు గుడ్డలతో - దండము విడచి వేణువు బట్టి

2. వేదము వదలి పాటల పాడుచు - రుద్రాక్షల వీడి ముత్యాల సరముల
త్యాగము విడచి భోగముతోడ - యోగి రాజయిన ప్రణయలోలుడిగా

3. పామరులనైన ఉద్ధరించుటకు - పామర వేషము పామర భాషతో
శాస్త్రాల వదలి శ్రుతి పండితుడు - కొంటె వాడగు గొల్ల వానిగ

4. బ్రహ్మర్షులకును అందనట్టిది - బ్రహ్మానందము నీయ పామరులకి
ఙ్ఞాన సారమే భక్తి యోగమని - తెలియ చెప్పుటకు గోప వేషమున

Download this bhajan sung by Shri Dattaswami here
------------------
కొండల రాజా! ఈ బండ మనసుల
భక్తి ఝరులిక పుట్టవు పుట్టవు
కుందేటి తలపై కొమ్ము పుట్టినను
ఎండ మావుల నీరు చిక్కినను (పల్లవి)

1. రాధ ఎచ్చట ! మీర ఎచ్చట ! - గోదా ఎచ్చట ! నాంచారి ఎట !
శంకరుడెచట ! రామానుజుడెట ! - రామకృష్ణ పరమహంస ఎచ్చట !

2. పతులను సతులను ధనముల గృహముల - కాలదన్నిరే నీ కొరకై
ఒక్క గంటయును నీ ముచ్చటలో - స్థిరముగ నుండరు చంచల చిత్తులు

3. చలన చిత్రముల వ్యర్ధ భాషణముల - గంటలు గంటలు ఆసీనులగుచు
పిడుగులు బడ్డను విన ప డవవియె - బురద గుంటయే వీరికి బ్రహ్మము

Download this bhajan sung by Shri Dattaswami here

దత్తులోరమండీ - మేమే దిగి వచ్చితి మండీ

దత్తులోరమండీ - మేమే దిగి వచ్చితి మండీ (పల్లవి)

సాధన పూర్తిగ చేయకయే! కొన్ని సిద్ధులను పొందగనే
అవతారములుగ గురువులుగా! బ్రహ్మాஉహమని కొందరిలన్
అష్ట సిద్ధులకు అధిపతియౌ ! సృష్టి స్ధితి లయకరుడతడె
ఆంజనేయుడే వినయముతో ! దాసోஉహమ్మను మాకుగదా

సృష్టి స్ధితి లయ కర పదమే ! - మా కిరీటమిది ఇచ్చితిమి
అతడికె బాధ్యత లేదు యికన్! అవతారముల రమించెదము
మా సొమ్ములేను సిద్ధులిలన్ ! బహుమానముగా ఇచ్చెదము
ఙ్ఞానమె ప్రేమయే మా గుర్తు! అవె మా రూపము, మా కళయౌ

మా ఊహలేను జగమంతా! అష్ట సిద్ధులను ఊహలుగా
ఊహలె జీవులు వినోదమే!ఊహించు వ్యక్తి మేమేగా
సృష్టి, స్ధితి లయ కారణమౌ! ఒక్క బ్రహ్మమే చిద్ఘనమై
దత్త కృతిగా వెలిగెదము! బ్రహ్మ విష్ణు శివ వేషములన్

Download this bhajan sung by Shri Dattaswami here