Download

బ్రాహ్మణ పురోహితులకు పందేశము: (Download)

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.

Monday, May 12, 2008

భజ భజ దత్తం - భజ భజ దత్తం (పార్ట్ -1)

భజ భజ దత్తం - భజ భజ దత్తమ్
భజ భజ దత్తం - భజ భజ దత్తమ్ (పల్లవి)

1. తత్సవితుస్త ద్దేవతాయాః - వరేణ్య భర్గో ధీమహీహః
ప్రచోదయేద్వై ధియో యో నః - తంబ్రహ్మాణం జ్ఞానసూర్యమ్‌

(దేవుడైన ఆ సవితయొక్క శ్రేష్టమైన ఆ తేజస్సును ధ్యానించు చున్నాము. ఏ దేవుడు మా బుద్ధులను ప్రేరేపించునో, అట్టి జ్ఞాన సూర్యుడైన ఆ బ్రహ్మదేవుడగు దత్తుని భజించుము).

2. ప్రాణిప్రసవా ద్యః ప్రసిద్ధః - సవితే త్యస్య బ్రహ్మతేజః
శిష్యధియశ్చ ప్రేరయేన్నః - తంగాయత్రీ మన్త్రసారమ్‌.

(ప్రాణులను ప్రసవించుట అనగా సృష్టించుటచేత ఏ దేవుడు సవితయని ప్రసిద్ధుడయ్యెనో, ఏ దేవుని బ్రహ్మతేజస్సు మా శిష్య బుద్ధులను ప్రేరేపించుచున్నదో, అట్టి గాయత్రీ మంత్రసారమైన దత్తుని భజింపుము).

3. గాయత్రీయం ఛన్దఏవ - సవితాదేవః స్మర్యతేచ
శిష్యాన్ధకార ముకుళితాబ్జ - ధీవికాసదం గురువరేణ్యమ్‌.

(గాయత్రి అనగా ఛందస్సు పేరే గదా! ఆ మంత్రదేవత సవితయని ముందే చెప్పబడినది గదా. శిష్యులయొక్క అజ్ఞానాంధ కారము చేత ముకుళించిన బుద్ధి పద్మములకు వికాసమునిచ్చు గురువరేణ్యుడగు దత్తుని భజింపుము).

4. కర్తాభర్తా హ్యేషహర్తా - సర్వస్యాస్య శ్రూయతేహి
త్రిమూర్తిరూపం బ్రహ్మచైకం - బ్రహ్మాకారం బ్రహ్మవాచమ్‌.

(ఈ జగత్తును సృష్టించువాడే పాలించి దీనిని హరించు వాడని శ్రుతి “యతోవా” అని చెప్పుచున్నది గదా. ఒకే పరబ్రహ్మము త్రిమూర్తి స్వరూపముతో నున్నది అనియే ఈ శ్రుతికి అర్ధము. బ్రహ్మదేవుని ఆకారముననున్న వేదములను చెప్పు బ్రహ్మదత్తుడగు ఆ సవితను భజింపుము).

5. త్రిపదం ఛన్దః త్రిస్వరోక్తం - త్రికాల వన్ద్యం త్రిగుణ సూత్రమ్‌
త్రివాహినీనాం సఙ్గమం వా - త్రిమూర్తి తత్త్వం యం వ్యనక్తి

( త్రిపాదములతో నున్నది గాయత్రీ ఛందస్సు. అది ఉదాత్త అనుదాత్తస్వరితములను త్రిస్వరములతోనున్నది. త్రిగుణములతో (మూడు పోగులు) నున్నది యజ్ఞోపవీతము. త్రివాహినుల సంగమమైన ప్రయాగవంటి పవిత్రమైన త్రికాల సంధ్యలయందు వందనీయమైన ఏ త్రిమూర్తి తత్త్వమును ఈ గాయత్రీ మంత్రము స్ఫురింపచేయునో అట్టి దత్తుని భజింపుము).

6. ఓఙ్కారశ్చ త్రివిధవర్ణః - త్రిస్రోవ్యాహృత యోஉపి యంహి
సంబోధయన్తి సర్వమన్త్రో - యమేవ వక్తి త్రిగుణమేకమ్‌.

(అకార, ఉకార, మకారములతోనున్న త్రివర్ణాత్మకమగు ఓంకారము, భూః భువః సువః అను మూడు వ్యాహృతులును, ఏ దేవునే సూచించునో, సర్వగాయత్రీ మంత్రము, సత్త్వ-రజః-తమః గుణములను కలిగిన ఏ ఒకే దేవుని చెప్పుచున్నదో అట్టి దత్తుని భజింపుము).

7. చత్వారోయం వేదశునకాః - గౌరనుసరతిచ వేదధర్మః
వీణాశ్రవణం వాణీపతిం - షోడశవర్షం బ్రహ్మదేవమ్

(నాల్గు వేదములు కుక్కలుగను, వేదధర్మమే గోవుగ వెంట నడుచు చుండగ వీణాశ్రవణమును చేయువాడును, వాణీపతియు, పదునారు సంవత్సరముల ప్రాయము కలవాడును బ్రహ్మదేవుడగు దత్తుని భజింపుము).

8. జగదారంభం హంసవాహం - తేజోవదనం మన్త్రమూలమ్
గాయత్రీశం సామగానం - విద్యానిలయం వేదపాఠమ్

(జగత్తును సృష్టించుటకు ఆరంభించుచున్నవాడును, హంస వాహనుడును, తేజస్సుతోనున్న ముఖము గలవాడును, మంత్రములకు మూలమును, గాయత్రికి అధీశ్వరుడును, సామగానము చేయుచున్నవాడును, విద్యలకు నిలయుడును, వేదపాఠము చేయుచున్నవాడునగు దత్తుని భజింపుము).

9. యజ్ఞాచరణం హోమనిష్టం - కమణ్డలుధరం దర్భపాణిమ్
అగ్నిజ్వాలా భాసమానం - ప్రాతస్సన్ధ్యా బాలభానుమ్

(యజ్ఞములను చేయుచున్నవాడును, హోమములందు నిష్ఠతోనున్నవాడును, కమండలమును ధరించి దర్భలను చేతపట్టిన వాడును, అగ్నిజ్వాలవలె ప్రకాశించుచున్నవాడును, ప్రాతస్సంధ్యాకాలమున వెలుగు బాలభానుడివలె ఎర్రగా భాసించుచున్న దత్తుని భజింపుము).
10. చందన తిలకే కుఙ్కుమాఙ్కం - బ్రహ్మతేజసా దీప్యమానమ్
త్రిజగన్మోహన సున్దరాఙ్గం - కాషాయధరం పణ్డితేశమ్

(ముఖమున చందన బింబ తిలకము, మధ్య కుంకుమ తిలకమును ధరించిన వాడును, బ్రహ్మతేజస్సుతో వెలుగుచున్న వాడును, త్రిలోకములను మోహింపచేయు సుందరాంగుడును, కాషాయ వస్త్రధారియు, పండితసార్వభౌముడునగు దత్తుని భజించుము).

11. అత్రేః పుత్రం బ్రహ్మదత్తం - అనసూయాంబా ప్రేమరాశిమ్
అజిన మేఖలం బ్రహ్మదణ్డం - యజ్ఞోపవీత మక్షమాలమ్

(అత్రిపుత్రుడగు బ్రహ్మదత్తుడును, అనసూయాంబయొక్క ప్రేమరాశియును, కృష్ణచర్మమును మేఖలగా కలవాడును, బ్రహ్మదండమును యజ్ఞోపవీతమును జపమాలను ధరించినట్టి దత్తుని భజింపుము).

12. స్వతనోరుద్య త్కమల గన్దైః - త్రిభువనాని హ్లాదయన్తమ్
బ్రహ్మముహూర్తే సాధాకానాం - ప్రచోదయేత్తా యో ధియో నః

(తన తనువునుండి ప్రసరించు పద్మగంధములచేత త్రిభువనములను ఆహ్లాదపరచువాడును, బ్రహ్మముహూర్తమున సాధకులగు మాయొక్క బుద్ధులను ఏ దేవుడు ప్రేరేపించునో అట్టి దత్తుని భజింపుము).

13. సృష్టిక్రమ వద పురుషసూక్తం - త్రిస్వరబద్ధం పావనార్ధమ్
ఋషిభిః పఠితం బ్రహ్మకాలే - శ్రుత్వాశ్రుత్వా ప్రీయమాణమ్

(జగత్తుయొక్క సృష్టిక్రమమును వివరించునదియు, మూడు స్వరములతో నున్నదియును, పవిత్రమైన అర్ధము కలదియగు, పురుష సూక్తమును తనివితీర విని విని సంతోషించుచున్న దత్తుని భజింపుము).

(ఈ భజన ఆడియో కొరకు భజ భజ దత్తం - పార్ట్ -2 చూడండి)

No comments: