Download

బ్రాహ్మణ పురోహితులకు పందేశము: (Download)

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.

Monday, May 5, 2008

శ్రీ మహాలక్ష్మి స్తుతి

(భృగుమహర్షి నారాయణుని హృదయంపై పాదఘాతము చేయుటతో కోపగించిన, దుఃఖితురాలైన శ్రీ మహాలక్ష్మి వైకుంఠం వీడి భూలోకంలోకి దిగివచ్చి కొల్హాపురం చేరుట.)

దిగివచ్చినదే మంగళ దేవత - వైకుంఠము వీడి వసుధకు రుసరుస
తన తండ్రి భృగువు తన్నగ నల్లుని - ఉరమున, ఉడికిన ఉద్రేకముతో (పల్లవి)

1. చెంపల చారెడు కన్నులు నిండిన - అశ్రువులొలకగ పెద్ద ముత్తెములు
పద్మా పద్మా యను పద్మాక్షుడు - వెంటబడి వెనుక ఆహ్వానించిన

2. ఘల్లు ఘల్లుమని కాలి అందెలును - మధురధ్వనులను పలుకుచుండగా
హంసయానమున దిగిదిగి వచ్చెను - మేఘ మార్గమున తారలు చెదరగ

3. విడివడిన కురుల విదలింపులతో - వడి వడి నడకల వేడి వేడిగను
నిశ్వాసములకు వాడిపోవగా - అధర పల్లవము పన్నుల నొక్కుచు

4. ముఖమున ఎర్రని తళతళకాంతుల - స్వేద బిందువులు జాలువారగా
బాల భాస్కరుని కిరణములొప్పగ - సంధ్య కాంతివలె శోభిల్లె పద్మ

5. బంగారుగాజులెగురగ గలగల - చేతుల నూపుచు బంగారుబొమ్మ
ఆ పద్మ నడవ అరవిందాక్షుడు - అల్లాడె వెనుక పరుగుల నెత్తుచు

6. కనక హారములు కులుకుల నడకల - గలగలలాడుచు గంతులేయగా
కమలా దేవత కదలి వచ్చెగా - కమలలోచనుడు కమిలి పోయెనే

7. ఆగు ఆగు మని అర్ధించుచున్న - అంతకంతకును వేగము హెచ్చగ
పద్మ నడచెనే పురుషోత్తముడదె - పరుగునవచ్చును వనమాల యెగుర

8. సాత్త్విక గుణవతి శాంతరూపిణివి - ఇంత ఆగ్రహము నీకేల దేవి !
నీ తండ్రి భృగువు నా తండ్రి సముడె - చరణ స్పర్శయు ఆశీర్వచనమె

9. ఇట్లు మాధవుడు వచించుచున్నను - పద్మకు దుఃఖము పొంగుచు పొరలెను
భర్తమాత్రమే కాదు హరితనకు - భగవంతుండును పాద దాసిగా

10. మణిపూర చక్ర మతిక్రమించిన - శ్రీ మహాలక్ష్మి తండ్రి బంధమును
లెక్కసేయకే పరమాత్ముడినే - సర్వాధికునిగ తలచిన ధన్యయె

11. వినదాయె పద్మ వేయి చెప్పినను - పరమాత్మ పరాభవమును సహింప
ఓర్వగ లేకయె ఏడుపు కోపము - మిశ్రమమై మది కల్లోలమయ్యె

12. అదిగోవచ్చును అరవిందాసన - అందాల రాశి ఆవేశముతో
అంబర వీధిని సప్త మహర్షులు - ప్రణమిల్లుచున్న అవలోకించదు

13. హరిపద సంభవ ఆకాశగంగ - హరి పదముల బడి సవ్వడి పొందుచు
అలలతో జెప్పు ఆగుమమ్మయని - అలివేణి పద్మ ఆగదు క్షణమును

14. తెల్లని గంగా జలముల నడచెడి - ఎర్రని పద్మా సతి ఖేచరులకు
ముత్యాలసరము మధ్యమాణిక్య - మొకటి చలించెడి రీతి జూపట్టె

15. వడివడి హరిపద వేగముతనలో - నవనవ వీచికలుప్పతిలఁజేయ
పద్మాపదముల తాకుచు పలికెను - హరి అభ్యర్ధన నందించు గంగ

16. కానీ పద్మా పదముల వేగము - తాకిడితో తన అలలు వెనుదిరిగి
పద్మ నిశ్చయము నందించ హరికి - మధ్యదూతివలె మందాకినియగు

17. భూలోక జనుల దరిద్రమంతము - చేయగ సమయము ఆసన్నమయ్యె
పద్మా చరణము లవనిని తగిలెను - సకల సౌభాగ్య సంపత్కరములు

18. భూదేవి సవితియైనను పదముల - సవితి తాకినను ఆనందించెను
అష్టైశ్వర్యములవనిని పొందగ - పద్మను నమస్కరించె భక్తితో

19. నడుచుచున్నదే నారాయణియదె - కొల్హాపురమున తపమును చేయగ
దైవావమాన తాపముతనలో - కోపకారణము అరుణ రూపమై

20. మంగళ దేవత చరణమార్గమున - పూలను రాల్చెను వనములతరువులు
తల్లి పాదములు కందిపోవునని - ముందుగ పవనుడు ఊడ్చి వేయగా

21. బంగారురంగు తామ్రాంచలమగు - హరికిష్టమైన చీరను కట్టిన
మంగళ దేవత పసుపు కుంకుమము - మేళవించినటు తోచుచున్నదే

22. మధుసూదనసతి మానవతీమణి - ఆత్మావమాన హేతువు కాదది
తండ్రిపాదమును బిడ్డ ఒప్పదా - స్వామి పరాభవమోర్వలేదాయె

23. ఎంతటి భక్తియొ ఆలోచింపుము - తండ్రికి తనకును మించి దైవమట
పరమ భాగవత భక్తాగ్రేసర - స్వామి పదసేవ నెప్పుడు విడువదు

24. ఆభక్తిమెచ్చి సర్వసృష్టికే - తన సంపదకే అధిదేవతగా
హరియుచేసెనే ఆ సతీమణిని - హృదయ దేవతగ ధరించె పద్మను

25. పద్మ పోవగా నారాయణుడదె - నళిన నేత్రముల భాష్పధారలను
కురియుచు పరుగిడు పద్మనామమును - ఎలుగెత్తి పిలుచు ఏడ్చుచు పెద్దగ

26. తండ్రి కన్నను స్వామియె ఎక్కువ - భక్తులకన్నది దక్షయాగమున
నిరూపించెనే ఆ సతీదేవి - సతియన పద్మయె శివుడన హరియె

27. కొల్హాపురమున పద్మాసనమున - యోగనిష్ఠలో కుర్చుండె పద్మ
అగ్నిగఁదోచును క్రోధ కాంతియదె - యోగాగ్ని మధ్య సతివలె పద్మయు

28. అశ్రుధారలను ఆపగ లేనివి - కన్నుల మూసెను ధ్యానించు హరిని
పద్మను పోలిన భక్తులెవ్వరే - భువనములందున సర్వోత్తమయే

29. మంగళ దేవత ! వందనమమ్మా - నారాయణి ! యివె నమస్కారములు
స్వార్ధ దరిద్రము పోగొట్టుమమ్మా - భక్తి సంపదను మాకిమ్ముతల్లీ !

Download this bhajan sung by Shri Dattaswami here.

No comments: