Download

బ్రాహ్మణ పురోహితులకు పందేశము: (Download)

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.

Saturday, April 12, 2008

శివ కీర్తనలు - 2

(శివదత్తుడు పార్వతీ దేవి దీక్షను పరీక్షించి, అనుగ్రహించి పార్వతీ కళ్యాణమునకు వెడలిన ఘట్టము).

కదలి వచ్చినాడె కళ్యాణమునకు
సుందరేశ్వరుడు సొగసుల రాయుడు కదలి వచ్చినాడె (పల్లవి)

1. జటాజూటమే కనక కిరీటము - చంద్రరేఖయే ముత్యాలసరము
ఫాలనేత్రమే అరుణతిలకమై - సంకల్పించగ వేషము మారెను

2. ఉరగములయ్యెను స్వర్ణహారములు - పడగల మణులవి మార్పును చెందక
తనువున తెల్లని భస్మము మారెను - సుగంధ కరమౌ అంగరాగముగ

3. గజాజినమయ్యె పట్టు వస్త్రముగ - గంగాధారయె మల్లెలమాలగ
చరణోరగములు మణినూపురములు - కంఠ నైల్యమే కలువపూవుగ

4. ప్రమధగణంబులు రాజవేషముల - మేళములూదుచు వాద్యనాదముల
బయలుదేరగా బయలుదేరెనే - పెండ్లి కొడుకై పరమేశ్వరుడు

5. మదవృషభంబదె నందీశ్వరుడు - సాలంకృతుడై చిరుమువ్వలతో
స్వామిని మోయుచు సుందరగతితో- ఝలఝల ఝలఝల రవముల నడచెను

6. వేదమంత్రముల చదువుచుముందుగ - వాణితో నడచె బ్రహ్మ దేవుడట
పద్మ గోవిందులిరుపక్కలలో - నడచిరి నవ్వుల కళకళలాడుచు

7. వాణి రచించిన మంగళ గీతుల - మధుర కంఠమున పద్మ పాడినది
మురహరుడంతట మురళినూదెను - తలనాడించెను స్మితముఖుడీశుడు

8. ముక్కోటి సురలు ముందుగ పక్కల - వెనుకను నడచిరి శంఖములూదుచు
స్వస్తి వాచనము లొప్పగ చెప్పుచు - సప్త మహర్షులు సరసనె నడచిరి

9. గంధర్వగణము గళమెత్తిపాడె - జయజయ శంభో జయశంభో! యని
కిన్నరు లందరు వీణల మీటిరి - అప్సరసలంత నృత్యమునాడిరి
Download this bhajan sung by Shri Dattaswami here
-------------
(త్రిపుర సుందరి యైన పార్వతిని వాణి, పద్మలు దేవకాంతలే సువాసినులుగా అలంకరిచిన ఘట్టము).

గౌరీ కళ్యాణ వైభవమే దేవ కాంతలే సువాసినులే (పల్లవి)

1. ఉత్తర తారను చంద్రుడుండగ - సింహలగ్నమున పార్వతి పెండ్లి
బంగారు బొమ్మ గౌరిని వధువుగ - చేయుచుండిరదె సువాసినులార!

2. గంగయె స్వయముగ తరలివచ్చెనే - మంగళస్నాన విధినొనరించగ
ఆస్నాన నెపముతోడ గంగక్క - కౌగలించెనే ముద్దుల చెల్లిని

3. పసుపును కలిపిన సున్నిపిండినే - నలుగును పెట్టగ వచ్చిరి స్వయముగ
వాణియు లక్ష్మియు విసిరివేసిరే - దానిని గౌరీ తను కాంతిఁజూచి

4. పన్నీరుఁజల్ల పరుగున వచ్చిరి - దేవకాంతలట పార్వతి మీదను
గౌరితనువున పద్మగంధమదె - సహజముగరాగ విరమించిరదియు

5. బంగారురంగు ఎర్రని అంచుల- పట్టు చీరెనే శివుని కిష్టమని
ధరింపఁజేసిరి బంగారు కాంతి - దేహమందునది కలిసిపోయెనే

6. బంగారు సొమ్ములన్నియు పెట్టిరి - గౌరికితనువున వెలవెల బోయెను
అగ్నిలో కాలి మరింత మెరుపున - వచ్చిన తనువది పూర్వజన్మఁ బడి

7. పూలహారములు నంగములందున - శోభిల్లు చుండ వనదేవతలా
పద్మవేసినది పద్మహారమును - కోత్త శోభతో వెలుగుచుండెనది

8. మొగలి పూవులే రేకుల ముడిచి - గులాబిపూవుల తురుముచు కట్టిన
పూలమాలతో మేళవించిరే - పెండ్లి కూతురికి జడనువేసిరే

9. కళ్యాణతిలకమప్పుడు దిద్దిరి - గౌరి ఫాలమున పద్మయు వాణియు
అరుంధతి పెట్టె కన్నులకాటుక - కాటుక చుక్కను బుగ్గపై చివర

10. హంసయానమున బయలుదేరెనే - మేళతాళములు మిన్నుముట్టగా
బంగారు గాజులవె కదులుచుండ - పదములనందెలు ఘల్లు ఘల్లుమన

11. పారాణి పాద పద్మములవియే - జగదంబవియట కదులుచున్నవే
అడుగు అడుగునకు కొత్త అందములు - అప్సరసలెమరి మురిసిపోయిరే

12. వాణియు పద్మయు కౌగిలించిరే - మోహభావమున తాళజాలకే
త్రిపురసుందరియె పెండ్లి కూతురై - సొగసుల దేవత నడుచుచున్నదే

13. కండ్లుమూసుకొని తపమును చేయును - శివుడెందులకో ఇపుడర్ధమాయె
అందాలరాశి నీ గౌరమ్మను - పొందుటకేలే అన హరి నవ్విరి

14. తత్తరలాడెను శివుని నేత్రములు - గౌరినిఁ జూడగ బ్రహ్మ మంత్రముల
నాలుగు ముఖముల నొకసారిచదువ - వేరువేరుగా బాగుండుననుకొనె

15. ముక్కోటి దేవత లొక్క దృష్టితో - చూచుచుండిరే కన్నులు చెమరింప
మంగళ సూత్రము కట్టునమ్మా - గౌరికి మెడలో శంకరుడు

16. భగవంతుడే వరుండనగా - భక్త జీవుడె పెండ్లి కూతురు
మంగళసూత్రమె భక్తి బంధము - అంతరార్ధమును తెలియండీ

17. భరించువాడే భర్తయగును - సర్వ భర్తయె పరమాత్మ
భరింపబడె జీవుడు భార్య - సహస్రార బంధమె కళ్యాణము

18. శివాయ మంగళం - సర్వ మంగళం - సర్వ మంగళా ధవాయ మంగళం
భవాయ మంగళం - దత్త మంగళం - అనఘా ప్రియాయ నిత్య మంగళం
Download this bhajan sung by Shri Dattaswami here
-----------------------
(సతీదేవి హిమవంతునకు పార్వతి నామధేయముతో జన్మించి, శివుని వరించి తపము చేయుచున్నప్పుడు శివదేవుడు కుహనావటువు రూపంలో వచ్చి ఆమె దీక్షను పరీక్షించుట).
గౌరి పరీక్షకు బ్రహ్మచారిగా వచ్చుచున్నా డు వామదేవుడు (పల్లవి)

సుందర తాపస తరుణ వేషమున - బ్రహ్మతేజమే ప్రజ్వరిల్లగా
కరముల దండ కమండలు ధారిగ- పండితోత్తముడు హుటాహుటి నడచి

చరణ పాదుకలు ధ్వనులను చేయగ - బ్రహ్మ వర్చస్సు ముఖమున చిందగ
తేజోమయ ననయంబుల చూచుచు - సన్న నవ్వు అధరంబున వెలయగ

విభూతి రేఖలు మధ్య కుంకుమము - ఎర్ర కాశ్మీర శాలువ భుజముల
వేదమంత్రముల తియ్యగ పలుకుచు - బ్రాహ్మణ నైష్ఠిక గాంభీర్యముతో

No comments: