Download

బ్రాహ్మణ పురోహితులకు పందేశము: (Download)

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.

Friday, April 18, 2008

సంకట మోచన హనుమత్ స్త్రోత్రము

సాగర లంఘన సంకుల వానర కులమవ లోక్య నిజస్తుతి లోలం
జలధర చుంబి మహా కృతి రేక పద క్రమలంఘిత జల నిధి రేవమ్‌
రఘుపతి మానందయసిచ సీతా కుశల నివేదన హృతఘన శోకం
కోనహివేత్తి కపీశ జగత్యతి సంకట మోచన నామ తవేదమ్


(సముద్రమును దాటు విషయములో వ్యాకులమై తనను స్తుతించుటలో మునిగి యున్న వానర కులమును చూచి జలధరములను చుంబించు మహాకారముతో కేవలము ఒకఅడుగుతో జలధిని లంఘించి, సీత క్షేమముగా ఉన్నదను వార్తను నివేదించి ఘనమైన శోకమును పోగొట్టి రఘుపతిని ఆనందింపచేయుచున్నవు ఓ కపీశ్వరా! మహాసంకట మోచనుడవను పేరు నీకున్నదని ఈ జగత్తులో ఎవరికి తెలియదు).

అహికుల బంధన మోహిత దాశరధీ ద్వయ మాలోక్య మనో వికలం
ఖగపతి మానయసిస్మ వికుంఠా పురగతమస్త్ర విమోచనదక్షమ్‌
పునరాయోధన బలినం వహసిచ భుజయుగరూఢం సోదరయుగ్మం
కోనహివేత్తి కపీశ జగత్యతి సంకట మోచన నామ తవేదమ్

(నాగముల పాశముతో మూర్ఛిల్లి నిశ్చేష్టులైన రామలక్ష్మణులను చూచి ఆ నాగాస్త్రమునుండి మోచనము కలిగించుటలో సమర్ధుడైన గరుత్మంతుని వైకుంఠమునుండి తీసుకువచ్చి నాగపాశ విమోచనము గావించి మరల యుద్ధమునకు సన్నద్ధులైన రామలక్ష్మణుల సోదరుల జంటను, నీ భుజస్కందములపైమోయుచున్నావు ఓ కపీశ్వరా!...)

మూర్ఛిత లక్ష్మణ భోధసమర్ధ మహౌషధిసంజివిలతాం నేతుం
ఉత్పతసి క్షణ మద్రిముపానయసిస్మ కరేణ తమివ సుమగుచ్ఛమ్‌
ఉత్థిత లక్ష్మణ కరయుగ వందన మాలింగసి విహసంశ్చ సరాగం
కోనహివేత్తి కపీశ జగత్యతి సంకట మోచన నామ తవేదమ్

(యుద్ధములో మూర్ఛిల్లిన లక్ష్మణుని మూర్ఛను పోగొట్టుటకు సమర్ధమైన మహౌషధి యగు సంజీవి లతను తీసుకొని వచ్చుటకు ఒక్క క్షణకాలములో ఎగిరి ఆ సంజీవి పర్వతమునే పూలగుత్తివలె చేతిలో ధరించి తీసుకొని వచ్చినావు. సంజీవి లతతో మూర్ఛ నుండి లేచిన లక్ష్మణుడు రెండు చేతులెత్తి చేసిన నమస్కారమును పెద్దగా నవ్వుచూ ప్రేమతో గ్రహించినావు ఓ కపీశ్వరా!...)

శతముఖ రావణ హృత రఘునాయక మంబా బలిపశుముపగత మోహం
పునరానయసిచ తమసురముపగత జీవం విధాయపాతళేశమ్‌
రాఘవశరమూర్ధ్వముఖంకృత్వా నమ్రం హరసిచ యుధి దశకంఠం
కోనహివేత్తి కపీశ జగత్యతి సంకట మోచన నామ తవేదమ్

(కాళికాదేవికి బలినిచ్చుటకై శతముఖ రావణుడు మాయచే మోహింపచేసి రఘునాయకుని పాతాళమునకు తీసుకొనిపోగా, ఆ పాతాళ రాజగు శతముఖ రావణుడగు రాక్షసుని విగతజీవుని చేసి శ్రీరాముని మరల కొనితెచ్చినావు. రావణునితో రాముడు యుద్ధము చేయునప్పుడు యుద్ధనీతి ననుసరించి ఊర్ధ్వముఖముగా బాణమును వేయగా నీతండ్రియగు వాయుదేవుని అర్ధించి ఆ బాణము అధోముఖముగా చేసి రావణుని నాభిలోయున్న అమృత కలశమును ఛేదించి సంహరించినావు ఓ కపీశ్వరా! ...)

శృంఖలయా నియత శనైశ్చరమపి మోచయసిస్మ శుచ స్సహసాతం
కోమే సంకట ఇహ హనుమన్గురు సోదర మామవ దయయా దీనమ్‌
కధమపి యోగ్యో నాహమకారణ కరుణైవ తవహి కారణమేకం
కోనహివేత్తి కపీశ జగత్యతి సంకట మోచన నామ తవేదమ్

(సర్వసంకట కారకుడగు శనైశ్చరుడే లంకానగరమున ఇనుప సంకెళ్ళతో బంధించబడి దుఃఖసంకటములో పడగా వెంటనే ఆ శనైశ్చరుని బంధవిముక్తిని గావించితివి. అట్టి నీకు ఇచ్చట నా సంకటమొక లెక్కయా? ఓ హనుమంతా! అన్నా! గురుదేవా! దయతో దీనుడైన నన్ను రక్షించుము. ఏ విధముగా చూచినను నాకు యోగ్యత లేదు. కాని అకారణమైన నీకు గల కరుణయే ఒకే ఒక కారణముగా నన్ను రక్షించుము ఓ కపీశ్వరా!...)

వానరసింహ ఖగేశ వరాహ హయానన పంచానన శివరూపం
వైష్ణవ తిలకం భవిష్య జగతాం ధాతారంత్వాం నమామిదేవమ్‌
త్రిమూర్తి తత్వం సాక్షాద్దత్తం పరమబ్రహ్మహి లీలాదాసం
కోనహివేత్తి కపీశ జగత్యతి సంకట మోచన నామ తవేదమ్

(వానర - సింహ - గరుడ - వరాహ -హయ - ముఖములతో పంచానన శివ రూపుడును విష్ణు తిలకము గలవాడును ఈ జగత్తుకు భవిష్యద్బ్రహ్మయు త్రిమూర్తి తత్త్వముతో సాక్షాద్దత్తుడవయ్యును లీలా వినోదముకు దాసుడుగా గోచరించు ఓ హనుమద్దేవా! నిన్ను నమస్కరించుచున్నాను ఓ కపీశ్వరా!...)

హే కనకాంశుక ! కాంచన కుండల వందేత్వాం హనుమంతమనంతం
హేపింగళాక్ష ! సద్గుణ సాగర ! మామవ సతతం మాయామూఢమ్‌
హే మేరుగిరి సముజ్వల విగ్రహ ! పాలయమాం తవ పదయుగలోలం
కోనహివేత్తి కపీశ జగత్యతి సంకట మోచన నామ తవేదమ్

(బంగారు వస్త్రములు ధరించినవాడా! బంగారు కుండలములు కలవాడా! అనంతా! హనుమంతా! నీకు వందనములు. ఓ పింగళాక్షా! ఓ సద్గుణ సాగరా! మాయచేమూఢుడైన నన్ను సదా రక్షించుము. మేరు పర్వతమువలె ప్రకాశించు శరీరము కలవాడా! నీ చరణ ద్వయమునందు ఆసక్తుడైన నన్ను పాలించుము ఓ కపీశ్వరా!...)

సంకటమోచన హనుమద్దేవ మహాస్తుతి మేతాం గాయతి నిత్యం
యోమనుజస్స సమేతి శతాయు ర్బల మారోగ్యం తేజోధైర్యమ్‌
శతశత సంకట జాల మపిక్షణ మేవ వినశ్యతి యాతి సతోషం
కోనహివేత్తి కపీశ జగత్యతి సంకట మోచన నామ తవేదమ్

(ఈ సంకటమోచన హనుమద్దేవతా మహాస్తోత్రమును ఏ మానవులు నిత్యము పాడుదురో వారికి శతాయుర్దాయము, బలము, ఆరోగ్యము, తేజస్సు, ధైర్యము లభించును. వందల కొలది సంకటములు వలగా చుట్టినను ఒక్క క్షణ కాలములో నశించి ఆ మానవులు ఆనందమును పొందుదురు ఓ కపీశ్వరా!...)

Download this bhajan sung by Shri Dattaswami here

No comments: