Download

బ్రాహ్మణ పురోహితులకు పందేశము: (Download)

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.

Saturday, April 12, 2008

జయ జయ రుద్రావతార హే వీరభద్ర నీ కెదురివ్వరిలన్

(సతీదేవి అగ్నికి ఆహుతి కాగా శివ భగవానుడు తాండవము చేసి క్రోధాగ్ని ఉట్టిపడ వీరభద్రుని సృజించి యజ్ఞమును ధ్వంసము చేయనియోగించగా శ్రీ వీరభద్రుని విజృంభణ).
జయ జయ రుద్రావతార హే వీరభద్ర నీ కెదురివ్వరిలన్ (పల్లవి)

1. ఉగ్రుని ఉగ్రమె వీరభద్రునిగ ఆకృతి దాల్చగ నృత్యములో
రంకెలు వేయుచు గంతుల నెగురుచు ఖడ్గము త్రిప్పుచు హస్తముతో
బయటకు వచ్చెను పింగళజటలవె ప్రళయాగ్ని శిఖలు తోచెడిగా
జయ జయ రుద్రావతార హే వీరభద్ర! నీ కెదురివ్వరిలన్

2. ప్రళయపయోధర కులములు నొకపరిచేరుచు నురిమిన శబ్దముతో
పటుతర గర్జనలోప్పగ 'దక్ష పిపీలికమా! ఎటనుంటివిరా ' ?
అనుచుచు కేకల వేయుచు గగన పధంబున ప్రస్థితుడైతివిగా
జయ జయ రుద్రావతార హే వీరభద్ర! నీ కెదురివ్వరిలన్

3. పదపద ఘాతమునందున మేఘము లెగురగ నక్షత్రంబులవే
ధూళి కణంబులుగా పైకెగురుచు తారాథూమములుప్పతిలన్
భగ భగ మండెడి విస్ఫులింగములు కన్నుల వర్షముగా కురియన్
జయ జయ రుద్రావతార హే వీరభద్ర! నీ కెదురివ్వరిలన్

4. నిను తిలకించిన దేవగణంబులు మునులును పరుగులు తీసిరిగా
అదియె మహా ప్రళయంబదె వచ్చె నటంచుచు కేకలతో దిశలన్
మెలిదిరిగిన మీసములె కత్తులుగా ముఖమందున భీకరముల్
జయ జయ రుద్రావతార హే వీరభద్ర! నీ కెదురివ్వరిలన్

5. ఋషులను సురలను పాదఘాతములఁ దన్నుచు వచ్చిన పాపముకై
శివరహితంబగు క్రతువును చేయగ ఎంత పొగరనుచు గర్జనతో
క్రతువున వెలిగెడి అగ్ని గుండమున ఉమ్మి వేసియట నార్పితివే
జయ జయ రుద్రావతార హే వీరభద్ర! నీ కెదురివ్వరిలన్

6. దక్షుని శిరమును తెంచితివచ్చట ఖడ్గముతో నావేశముతో
ఛీ ఛీ తుచ్ఛాయని గాండ్రించుచు వ్యాఘ్రమురీతిగ దూకులతో
ఉగ్ర విహారము చేయగ బ్రహ్మయు, హరియు నుతింప నిలచితివే
జయ జయ రుద్రావతార హే వీరభద్ర! నీ కెదురివ్వరిలన్

7. హే! కరుణార్ణవ ! దక్షుని జీవము నిచ్చితివప్పుడు శాంతుడవై
విధి హరి యాచన మన్నించితివే దయతో నీ పదమందు పడన్
మేషముఖుండగు దక్షుడు నిన్ను నుతించగ వీరేశ్వర శరభా !
జయ జయ రుద్రావతార హే వీరభద్ర! నీ కెదురివ్వరిలన్

8. హే! కరిమర్దన ! హే క్రతుఖండన ! హే విషకంధర! నందిపతే
హే! శశిశేఖర! హే ఫణిభూషణ ! హే కాలాంతక! స్కందగురో
హే ! వీరేశ్వర ! హే పరమేశ్వర ! హే లయ తాండవ ! ప్రమధపతే!
త్వాం ప్రణమామి మహేశ్వర ! శంకర ! పాలయ కింకర మీశ్వరమామ్‌

9. వీరంభజే - వీరభద్రం భజే - రౌద్ర వికటాట్టహాసంభజే
కాళీపతే - భద్రకాళీపతే - రౌద్ర వికటాట్టహసంభజే
శ్రీ భద్రకాళీ సహితం వీరభద్రం నమామ్యహమ్
కులదేవం ప్రసూతాత రూపాన్తర మివస్ధితమ్‌

No comments: