Download

బ్రాహ్మణ పురోహితులకు పందేశము: (Download)

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.

Monday, April 14, 2008

సతీ దేవి కీర్తన

శివ దత్త కీర్తనలు
(దక్ష ప్రజాపతి కుమార్తె శ్రీ శివ దేవుని రాణి సతీదేవి. తండ్రియగు దక్ష ప్రజాపతి శివుని ఆహ్వానించక శివ రహితమైన యఙ్ఞము తలపెట్టి కుమార్తె సతిని అల్లుడు శివుని ఆహ్వానించలేదు. తన చెల్లెళ్ళు ఆ యఙ్ఞమునకు వెళ్ళుచుండగా జూచిన సతి, భర్తను బ్రతిమాలి శివుడు వద్దన్ననూ వినక స్వామీ అనుఙ్ఞ ఇవ్వండి అని బ్రతిమలి ఆ యజ్ఞమునకు వెళ్ళింది. అక్కడ తండ్రి దక్షుడు శివనిందచేసి ఆమెను అవమానించాడు. భగవంతుడైన శివుని అవమానమును భరించలేక సతీదేవి సతీత్వమును చెందు ఘట్టము.)

సతీ దేవి కీర్తన

1. దక్షాయనుచును ఏకవచనమున - సంబోధించెను తండ్రిని శివసతి
దాక్షాయణియె మొట్టమొదటిగా - స్వామి దూషణము నోర్వగలేకయె

2. ఓరీ! దక్షా ! నోరుమూయుమిక - నా తండ్రిగాన బ్రతికి పోతివిట
వేరొకరైతే నా శాపాగ్నికి - భస్మమయ్యెదరు శివదూషణకై

3. నీకు పుత్రికగ జన్మించుటయే - నేను చేసినది మహాపాపమే
తత్ఫలమిప్పుడు శివదూషణమును - వినవలసెను నేనేల బ్రతుక?

4. స్వామి దూషణము నాకర్ణించియు - బ్రతికి యుంటినే పాపిష్ఠిదాన
కావున పాపికి నీకు పుట్టితిని - మరణించుటయే ప్రాయశ్చిత్తము

5. శివుడన నెవరని తలచుచుంటివో - మూఢాగ్రేసర రాజాధిరాజ !
శివుడే దత్తుడు పరమబ్రహ్మము - త్రిమూర్తులాయన వేషములేగద

6. జగదుత్పత్తిని జగత్పాలనను - జగదంతమునే చేసెడి వాడే
పరమేష్ఠియనగ పురుషోత్తముడన - పరమేశ్వరుడన నతడే దత్తుడు

7. ఓరీ దక్షా ! ఙ్ఞానాంధుండవు - నీ కేమి తెలియు శివమహాత్మ్యము
కరుణరూపుడా పరమేశ్వరుడే - కావున తిట్టియు బ్రతికి యున్నావు

8. శివదూషణమే మహాపాపము - దానిని మించిన పాపము లేదట
దానికి ప్రాయశ్చిత్తము లేదుర - సర్వ పాపహరమగు శివనామము

9. అర్ధము తెలుయునే ? సర్వమంగళుడు - అని శివశబ్దము తాత్పర్యంబని
శివరహితంబగు కర్మయేదైన - అమంగళంబగు నశుభము తుచ్ఛము

10. శ్మశానవాసిని శివునర్చించిన - శ్మశానగమనము తప్పును దక్షా!
అపమృత్యుహరము మృత్యుంజయుడని - తలచుటయని మునిగణములు చెప్పవె

11. దిగంబరుండే కృత్తివాసుడే - పట్టు వస్త్రముల దాల్చనివాడే
కానీతత్పద నతుడు ప్రతిదినము - స్వర్గసంపదల రక్షకునింద్రుడు

12. శివపద ధూళిని శిరమునఁదాల్చును - ప్రతి సూర్యోదయమందున సురపతి
ఆరోజు వరకు అతడికి స్వర్గము - సురక్షితంబగు దక్షా! వినరా !

13. సర్వసంపదల నతడే యిచ్చును - సృష్టి యంతయును అతడి సొత్తే
బిడ్డలు దీనిని భోగించచూచి - సంతుష్టుండగు ఆ మహేశ్వరుడు

14. ఓ పిచ్చి వెధవ ! దరిద్రుడనగా - అమంగళుండన నోరెట్ల వచ్చె
నేత్ర పద్మమును అతడికర్పించి - సర్వ లోకపతి పదవిఁ బొందె హరి

15. శిశుపాలుతిట్లు విని గోపాలుడు - సభలో వక్కల లెక్కించినట్లు
నీ దూషణములు లెక్కపెట్టబడు - మహాకాలుడగు పరమేశునిచే

16. బ్రహ్మయు హరియును యత్నింపలేదె ? కనుగొననీశ్వరు మొదలును తుదినట
హంసవరాహము రూపము లెత్తియు - చేతగాక శివ శరణముఁ జొచ్చిరి

17. వారికె తెలియనసాధ్యుడు శివుడు - నీకేమి తెలియు వాగబోకురా
హరివిధులముందు నీవొక చీమవు - ఆతత్త్వ మెరుగ నీతరమగునే !

18. నీ బోడి యఙ్ఞమెంతర దక్షా ! - యఙ్ఞపురుషుడగు నారాయణుడే
మేరు శైలమున ప్రతి దినమాయనను - పూజించె కమల సహస్రార్చనల

19. నారాయణునే పరీక్షఁ జేసెను - మాయజేసెనొక కమలము నొకపరి
నేత్ర కమలమును పెరికి అర్పించె - ప్రసన్నుడై శివుడెదురుగ నిలచెను

20. కౌగలించె శివుడబ్జలోచనుని - మోహిని భావము నందుచు హరియును
పతిగా తలచెను పరమేశ్వరునే - పురుషోత్తముడే స్త్రీ భావమందె

21. నాటినుండియును సర్వ జగత్పతి - పదవిని మురారి కిచ్చెను భార్యకు
మోహినిరూపము దాల్చి భార్యగా - పురుషోత్తముడే మారెను దక్షా!

22. నీవొక పురుషుడ వైతివీనాడు - పురుషోత్తమునకు పురుషుడగువాని
అల్పుడిగఁ దలచి నాడవు మూర్ఖా ! - నీ అజ్ఞానపు జలధి అపారము

23. శివ నామమును ఉచ్చరింపగనె - శాంతించుమనము పవిత్రతఁ గలుగు
ఒక్కసారి శివ నామము పలుకుచు - అనుభవమందుము మూర్ఖత్వమేల ?

24. మహాప్రళయమున సర్వ జగత్తును - భస్మముఁ జేయును కాలాంతకుడై
సర్వమీశ్వరుని వశముననుండును - విభూతికర్ధము ఇదె భస్మమునకు

25. తాండవగళితము భస్మమును సురలు - సంగ్రహించి తిలకంబు ధరింతురు
శివతనువునుండి రాలినదానిని - చూచి దరిఁజేర భీతుడగు యముడు

26. హాలహలమట జగములదహింప - మగవాడెవడు ముందుకు వచ్చెను ?
పురుషుడొక్కడే పరమేశ్వరుడే - దానిని మింగెను నీలకంఠుడై

27. భస్మమైతిరే నీకు తెలియదా - అట్టహాసమున త్రిపురాసురులే
శరభావతారమెత్తి రుద్రుడే - నరసింహుని శాంతింప చేసెనే

28. ఆదిదేవుడా ! దేవ దేవుడా ! మహాదేవుడా ! నా ప్రాణనాధ !
నా ప్రాణ దీపమారిపోనిమ్ము - నీ నిందవిన్న బ్రతుకు నాకేల ?

29. నా ప్రాణనాధ ! నీ చరణమందు - నా ప్రాణ దీప మారిపోవగా
నాకాభాగ్యము లేదాయెనాధ ! - వీడి కడుపునకు పుట్టినందులకు

30. నీ ప్రేమలోన జీవించియున్న - నిజమైన భక్తురాలనైనచో
నా పాదాంగుళి నిదిగోరుద్దితి - భూమిపై అగ్ని పుట్టిననుగాల్చు

31. అపుడు యోగాగ్ని పుట్టెను దహించె - సతీదేవినే హాహారవములు
మిన్నుముట్టెనే మునిసుర కృతములు - ఎంత భక్తియని అచ్చెరువొందిరి

32. స్వామి దూషణము విన్నమాత్రమున - ప్రాణత్యాగము చేసిన సతినే
మూడుచూపులును ఏకముకాగా - చూచెవిస్మితుడు పరమేశ్వరుడును

33. మూడు నేత్రముల బాష్పధారలే - త్రిమార్గగంగా వాహినిఁ బోలుచు
కురియగ పల్కెను స్వామి 'ఓ ప్రియా-నీ ప్రేమ నెరుగ నాకునసాధ్యము'

భగవద్దూషణ శ్రవణమాత్రమున - ప్రాణము విడచిన సతీమాతరో
సాష్టాంగమిదియె ప్రణతులు తల్లీ ! - మాకిమ్ము నీదు భక్తి లేశమును

Download this bhajan sung by Shri Dattaswami here

No comments: