Download

బ్రాహ్మణ పురోహితులకు పందేశము: (Download)

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతము నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా మార్చి, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్ భక్తిని పెంచి హిందూమతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి.

Saturday, March 29, 2008

మహిషుని చంపిన కనకదుర్గా కీర్తన

విజయపురాచల కాంచన దుర్గా
తాండవ మందలి చిందులవే (పల్లవి)

మహిషునిఁ జంపిన రోషము శాంతించని కారణమున గంతులతో
కరముల శూలముఁ దిప్పుచు చుట్టును విద్యుద్దీధితులుప్పతిలన్‌
కనకాభరణములెగురగ, గాజులు గలగల మోతల వెల్లువలో
విజయపురాచల కాంచన దుర్గా తాండవ మందలి చిందులవే

గిరగిరఁ దిరుగుచు, ముందుకు దూకుచు, పక్కలకెగురుచు నృత్యములో
భగభగ మండెడి నిప్పుల కణికెలు రాలగ త్రిణయన దృష్టులతో
వైశాఖ దివస మధ్యాహ్నపు వడగాలులవడి ఉచ్ఛ్వాసములన్‌
విజయపురాచల కాంచన దుర్గా తాండవ మందలి చిందులవే

క్రోధ విలఙ్ఘన తాడిత నాగ కులంబుల మెలికల దూకులతో
అవయవ వీచికలాడగ రక్తము పొంగగ ఎర్రని వెలుగులతో
కుంకుమ తిలకము స్వేదజలంబుల రేఖలుగానగు ఫాలముతో
విజయపురాచల కాంచన దుర్గా తాండవ మందలి చిందులవే

ముడి విదిలింపులు సడలగ, విరబోసిన కేశములవె పాయలుగా
ఎగిరెడి నల్లని త్రాచులు, మహిషుని అసు పవనంబుల మ్రింగెడిగా
ముఖమున రొప్పులు శ్వాసలు కస్సుమటంచును బుసబుసలైచెలగన్‌
విజయపురాచల కాంచన దుర్గా తాండవ మందలి చిందులవే

పదములనందెలు వెండివి మెండుగ ఘల్లు ఘల్లుమని శబ్ధములన్‌
పదపదమందున చేయగ నసురుల బండల గుండెలు ఖండములై
దితిసుత రక్తము ఎగురుచు చిందుచు బిందువులై ముఖమందు పడన్‌
విజయపురాచల కాంచన దుర్గా తాండవ మందలి చిందులవే

కులుకుచు శూలము నాడించుచు, కుచపర్వత కంపము లింపులుగా
పరవశమొందిన దత్తుడు చూదగ ప్రణయము పొంగగ సన్నిధిలో
నిలువగ చూచెను మధురస్మితయై శాంతించెను శాంతించెనుగా
విజయపురాచల కాంచన దుర్గా తాండవ మందలి చిందులవే

Download this bhajan sung by Shri Dattaswami here

No comments: